సమ్మె ప్రభావంతో కొండెక్కిన మారుతి సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు

వినియోగదారులు చూపిస్తున్న అశేష ఆదరణ కారణంగానే నేడు మారుతి సుజుకి భారతదేశపు అగ్రగామిక కార్ల తయారీ కంపెనీగా నిలిచింది. అయితే, మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో నెలకొన్న తాజా సమ్మె పరిస్థితుల కారణంగా కొత్త కార్ల ఉత్పత్తి అంతంత మాత్రంగానే సాగుతుంది.
ప్రస్తుతం మారుతి సుజుకి నుండి కొత్త కార్లను కొనుగోలు చేయాలంటే వాటి వెయింటింగ్ పీరియడ్ (ఎంపిక చేసిన మోడళ్లు మాత్రమే) గణనీయంగా పెరిగిపోతుంది. దీంతో మారుతి సుజుకి బ్రాండ్‌పై మనసు పారేసుకున్న కొనుగోలుదారులు కొత్త కారు కోసం అంతంత సమయం వెయిట్ చేయలేక పోతున్నారు.
పోనీలే అని, మారుతి సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేద్దామని ప్రీ-ఓన్డ్ (సెకండ్ హ్యాండ్) కార్ షోరూమ్‌లకు కొనుగోలుదారులు వెళ్తుంటే.. అక్కడి వారు ఇదే అవకాశాన్ని అదునుగా చేసుకొని సెకండ్ హ్యాండ్ మారుతి సుజుకి కార్ల ధరలను భారీగా పెంచేస్తున్నారు.
దీంతో కొనుగోలుదారులు ఇటు కొత్త మారుతి కార్లను, అటు సెకండ్ హ్యాండ్ మారుతి కార్లను కొనుగోలు చేయలేక ఇతర బ్రాండ్‌లను ఆశ్రయిస్తున్నారు. మారుతి సమ్మె ప్రభావంతో కంపెనీ నష్టాల బాటలో ప్రయాణిస్తుంటే, మారుతి పోటీదారులు, సెకండ్ హ్యాండ్ కార్ డీలర్లు మాత్రం దీపావళి రాక ముందే పండుగ చేసేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications








