పెరుగుతున్న వడ్డీ రేట్లు మరియు ఇంధన ధరలకు తోడు గడచిన జూన్ నెలలో 13 రోజుల పాటు జరిగిన సమ్మె దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా అమ్మకాలపై ప్రభావం చూపనుంది. గతేడాది అమ్మకాలలో 30 శాతం వృద్ధిని కనబరిచిన మారుతి సుజుకి ఈ ఏడాది అమ్మకాలు మాత్రం కేవలం 8 శాతం 10 శాతానికి మధ్యలలో నమోదు కావచ్చునని కంపెనీ తెలిపింది. "మేము ఉత్పత్తిని నష్టపోయాము. గతేడాది అమ్మకాలు 30 శాతం వృద్ధితో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఈ ఏడాది అమ్మకాల వృద్ధి శ్రేణి 8-10 శాతం మధ్యలో మాత్రమే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం" అని కంపెనీ జనరల్ మేనేజర్ మరియు కమర్షియల్ బిజినెస్ హెడ్ (సౌత్) మనోహర్ భట్ తెలిపారు.
రానున్న పండుగ సీజన్‌లో అమ్మకాలు జోరందుకోగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ కొత్తగా విడుదల చేసిన కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ స్విఫ్ట్‌పై భారీ అంచనాలు పెట్టుకుంది. ప్రతి నెలా ఈ మోడల్ కార్లను 17,000 యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని భట్ చెప్పారు. మారుతి సుజుకి తన కొత్త స్విఫ్ట్‌ను కేరళ మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో పాత స్విఫ్ట్‌ను ప్రతి నెలా 12,000 యూనిట్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది.