భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఇటలీ కారు మాసేరటి

ఇటాలియన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ మాసేరటి, గత నెలలో చెప్పినట్లుగానే భారత మార్కెట్లో తమ లగ్జరీ కారును ఆవిష్కరించింది. ప్రస్తుతం భారత మార్కెట్లో క్వాట్రోపోర్ట్, గ్రాన్‌తురిస్మో, గ్రాన్ కాబిరో అనే మూడు మోడళ్లలో ఇవి అందుబాటులో ఉంటాయని, త్వరలోనే అన్ని మోడళ్లు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది. ఈ కార్ల డెలివరీలను జూలై-ఆగస్టు నుంచి ప్రారంభం చేస్తామని కంపెనీ వెల్లడించింది.
దేశీయ మార్కెట్లో వీటి ప్రారంభం ధరలు రూ. 1.20 కోట్ల నుంచి రూ. 1.43 కోట్ల (ఎక్స్ షోరూమ్ న్యూఢిల్లీ) వరకూ ఉంటాయని కంపెనీ వివరించింది. గతేడాది భారత లగ్జరీ కార్ మార్కెట్ భారీ వృద్ధిని కనబరిచడంతో తమకు కూడా ఈ మార్కెట్‌పై నమ్మకం పెరిగిందని, భారత్‌లో కాలుమోపినందుకు తమకు చాలా సంతోషంగా ఉందని మసేరటి ఆసియా ఫసిపిక్ మేనేజింగ్ డైరెక్టర్ సిమోన్ నికోలాయ్ చెప్పారు. భారత్‌లో లగ్జరీ కార్ మార్కెట్ దాదాపు 70 శాతం వృద్ధి చెందింది. 2010లో సుమారు 15,000 కార్లు అమ్ముడై ఉంటాయని అంచనా.
ఫియట్ సంస్థకు చెందిన అనుబంధ కంపెనీ అయిన మాసేరటి భారత్‌లోని శ్రేయాన్స్ గ్రూపును తమ అధికారిక దిగుమతిదారుగా నియమించుకుంది. ఈ ఏడాది ముంబైలో తమ తొలి షోరూమ్‌ను ఏర్పాటు చేస్తామని, వచ్చే ఏడాది ప్రారంభంలో న్యూఢిల్లీలో రెండో షోరూమ్‌ను ప్రారంభిస్తామని, 2015 నాటికి దేశంలోని ఏడు ప్రాంతాలలో తమ కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నామని నికోలాయ్ తెలిపారు. 2010లో ప్రపంచ వ్యాప్తంగా 5,675 కార్లను విక్రయించామని, రానున్న మూడేళ్లలో భారత్‌లో 100 కార్లు విక్రయించాలని కంపెనీ భావిస్తోంది.
ఇటలీలోని మోడెనా ఉత్పత్తి కేంద్రంలో మాసేరటి పరిమిత సంఖ్య (లిమిటెడ్ ఎడిషన్)లో మాత్రమే తమ కార్లను తయారు చేస్తుంది. వీటిని దాదాపు 75 శాతం విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేస్తుంది. భారత్‌లో మూడు మాసేరటి మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. రెండు సీట్లు కలిగిన గ్రాన్ కాబిరో ధర రూ. 5 కోట్లు, సెడాన్ మోడల్ కారు క్వాట్రోపోర్ట్ ప్రారంభ ధర రూ. 3 కోట్లు, టాప్ ఎండ్ స్పోర్ట్స్ వెర్షన్ కూప్ మోడల్ కారు గ్రాన్‌తురిస్మో ధర 4.75 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications








