ప్రిమీయం కార్ల తయారీకు పేరుగాంచిన మెర్సిడెస్ బెంజ్‌ను సైతం "రీకాల్" భూతం వదల్లేదు. ఫలితంగా అమెరికాలో లక్షకు పైగా బెంజ్ కార్లు రివర్స్ గేర్ దారి పట్టాయి. క్రూయిజ్ (స్పీడ్) కంట్రోల్ సంబధిత సమస్యల కారణంగా అమెరికాలో 1,36,000కు పైగా ఎమ్-క్లాస్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీ)ను మెర్సిడెస్ బెంజ్ రీకాల్ చేసింది. డ్రైవర్లు బ్రేక్ పెడల్‌ను తొక్కిన తక్షణమే క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ డిస్ఎంగేజ్ (వేరు కావడం లేదా ఆగిపోవడం) కావడం లేదని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫిర్యాదులు అందడంతో బెంజ్ ఈ రీకాల్ చేసింది.
క్రూయిజ్ కంట్రోల్‌ను స్పీడ్ కంట్రోల్ లేదా ఆటో క్రూయిజ్ అని కూడా అంటారు. ప్రత్యేకంగా రూపొందించే కొన్న రకాల హైఎండ్ కార్లలో మాత్రమే ఈ వ్యవస్థ ఉంటుంది. దీని వల్ల వాహన వేగం ఆటోమేటింగ్ నియంత్రించబడుతూ ఉంటుంది. కాగా.. 200-2002లో తయారైన మెర్సిడెస్ బెంజ్ ఎమ్-క్లాస్, 2000-2004లో తయారైన ఎమ్-క్లాస్ ఏఎమ్‌జి వాహనాలు ఈ రీకాల్‌కు వర్తిస్తాయని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.