ఉత్పత్తి సామర్థ్యం కన్నా ఉత్పత్తుల నాణ్యతే ముఖ్యం: హోండా

వచ్చే దశాబ్ధం నాటికి భారత్‌లో హీరో హోండాను వెనక్కు నెట్టి నెంబర్ వన్ స్థానంలో నిలవడమే తమ లక్ష్యమని హెచ్ఎమ్ఎస్ఐ మాజీ అధ్యక్షుడు షింజీ అవోయమా తెలిపారు. ఉత్పత్తి విషయంలో తమ కంపెనీకు హీరో హోండాకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని, ఉత్పత్తి సామర్థ్యాన్ని హీరో హోండాతో సరిసమానం చేసే అంశంపై తాము దృష్టి సారించబోమని, మార్కెట్ వృద్ధిపైనే తమ దృష్టి ఉంటుందని, ఇప్పటికే రెండో ప్లాంటును కూడా ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని తపుకరా వద్ద హోండా తమ రెండో ఉత్పత్తి కేంద్రాన్ని జూన్ 1, 2011వ తేదీన ప్రారంభించింది.
ఈ ప్లాంటు మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 12 లక్షల యూనిట్లు. దీని ఏర్పాటు కోసం కంపెనీ రూ. 860 కోట్లను పెట్టుబడిగా వెచ్చించింది. హోండా మొదటి ప్లాంటు గుర్గాన్‌లో ఉంది. దీని ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 12 లక్షల యూనిట్లు. ఇవే కాకుండా మరో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో కర్ణాటక రాష్ట్రంలో మూడో ప్లాంటు ఏర్పాటు చేసేందురు కంపెనీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇది 2013 నాటికి పూర్తికావచ్చని అంచనా. ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం కూడా సాలీనా 12 లక్షల యూనిట్లు. అయితే హీరో హోండా మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం (ఈ ఏడాది ఏప్రిల్ నాటికి) 61.5 లక్షల యూనిట్లుగా ఉంది. ప్రస్తుతం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా కంపెనీ భారత ద్విచక్ర వాహన మార్కెట్లో నాలుగో స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications








