త్వరలో పెట్రోల్ ధరలను పెంచనున్న చమురు కంపెనీలు

లిబియాలో నెలకొన్న అనిశ్చితి మూలంగా ఇప్పట్లో ముడి ఇంధన ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. కొందరు తిరుగుబాటు దారులు కొన్ని చమురు గనులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో చమురు ఉత్పత్తి నిలిచిపోయింది. భారత్‌లో గత కొద్ది కాలంగా చమురు కంపెనీలు నష్టాన్ని భరిస్తూ వస్తున్నాయి. అయితే.. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా పెట్రోల్ ధరల సవరింపు విషయాన్ని పక్కన పెట్టడం జరిగింది.
పెట్రోల్ అమ్మకంపై లీటరు పెట్రోల్‌కు సగటున ఏడున్నర రూపాయల నష్టాన్ని చమురు కంపెనీలు భరిస్తున్నాయి. ప్రస్తుతం ఆ భారాన్ని ప్రజలపై మోపేందుకు చమురు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇదే గనుక జరిగితే లీటరు పెట్రోల్‌పై కనీసం ఐదు రూపాయల వరకూ ధర పెరగవచ్చని అంచనా. కాగా.. ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసీ) రానున్న రోజుల్లో పెట్రోల్ ధరలు పెంచనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది.
సాధ్యమైనంత త్వరగా ధరలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని ఐఓసీకు కొత్తగా ఎన్నికైన చైర్మన్ రణభీర్ సింగ్ బుటోలా చెప్పారు. ఐఓసీ బాటలోనే పయనించేందుకు మరికొన్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








