విడిభాగాల కొరతతో ఉత్పత్తిని కోల్పోతున్న ఆటోమొబైల్ రంగం

వాహనాల ఉత్పత్తి దాదాపు పూర్తయినప్పటికీ చిన్న చిన్న విడిభాగాల కారణంగా అవి తుది దశకు చేరుకోలేకపోతున్నాయి. జపాన్ ప్రభావం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు ఆటో కంపెనీలు ఈ నెలాఖరు నాటికి దాదాపు ఆరు లక్షల వాహనాల ఉత్పత్తిని నష్టపోవచ్చునని ఓ అధ్యయనంలో తేలింది. మార్చి 24, 2011 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 3.20 లక్షల వాహనాల ఉత్పత్తిని ప్రపంచ ఆటో పరిశ్రమ నష్టపోయినట్లు ఆ సర్వే పేర్కొంది. విడిభాగాల సరఫరాలు నిలిచిపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
ఏప్రిల్ నెలలో కూడా ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ నెంబర్‌వన్ ఆటోమొబైల్ సంస్థ టయోటా మోటార్ కార్పొరేషన్ 1.40 లక్షల వాహనాల ఉత్పత్తి నష్టపోగా.. హోండా మోటార్ కంపెనీ 46,600 వాహనాల ఉత్పత్తి నిలిచిపోయింది. మిత్సుబిషి, ఫోర్డ్ సంస్థలు సైతం భారీ సంఖ్యలోనే ఉత్పత్తి కోల్పోయినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. విడిభాగాల కొరత కారణంగా ఏప్రిల్ ఒకటి తర్వాత ఉత్తర అమెరికాలోని తమ యూనిట్‌లో ఉత్పత్తి పూర్తిగా నిలిచి పోవచ్చుని జపాన్ ఆటో దిగ్గజం హోండా మోటార్స్ ప్రకటించింది. జపాన్ అలజడి కారణంగా.. ఓహియో, అలబామా, ఇండియానా, కెనడా, మెక్సికోలో గల ప్లాంట్లలో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు కంపెనీ పేర్కొంది.
జపాన్‌కు చెందిన మరో ఆటో దిగ్గజం మజ్దా మోటార్ కార్పొరేషన్ కూడా 31,000 కార్ల ఉత్పత్తిని నష్టపోయినట్లు తెలిపింది. ఉత్పత్తి అంతరాయం కారణంగా ఇటీవల అమెరికన్ డీలర్ నుంచి వాహనాల కోసం వచ్చిన కాంట్రాక్టును కూడా కంపెనీ రద్దుచేసుకుంది. హిరోషిమా, హొఫులోని మాజ్దా ప్లాంట్లలో కొత్త మోడళ్ల తయారీ నిలిపివేశామని సంస్థ ప్రతినిధి టిమ్ గిల్మన్ తెలిపారు. నిస్సాన్ మోటార్, జనరల్ మోటార్స్ తదితర ప్రముఖ ఆటో కంపెనీలకు కూడా జపాన్ సునామీ తీరని నష్టాన్ని మిగిల్చింది. మే నెల వరకూ ప్రపంచ ఆటో పరిశ్రమకు ఈ కష్టాలు తప్పవని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








