సామాన్యుడి జీవితంలో చిచ్చు పెట్టునున్న డీజిల్!

పెట్రోల్ భగ్గుమనడంతో ప్రజలు డీజిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో డీజిల్‌కు డిమాండు భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ రేట్ల పెంపు విషయంపై సాధికారిక మంత్రుల బృందం దోబూచులాడుతోంది. వాస్తవానికి ఈ విషయం చర్చించేందుకు రేపు సమావేశం కావాల్సిన ఈ బృందం తమ సమావేశాన్ని వాయిదా వేసుకుంది. ఒకవేళ డీజిల్ ధరను పెంచాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. ఇప్పటికే దిగిరానని మొండికేస్తున్న ద్రవ్యోల్బణం మరింత పైకి ఎగబాకుతుంది. ఆ భారాన్ని తిరిగి సామాన్యుడే భరించాల్సి వస్తుంది. అయితే వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరిగడంతో దేశీయంగా సబ్సిడీపై ఇంధనాన్ని విక్రయిస్తున్న చమురు కంపెనీలు భారీగా ఆదాయాన్ని నష్టపోతున్నట్లు ప్రకటిస్తున్నాయి.
భారతదేశంలో మొత్తం ఇంధన వినియోగంలో పెట్రోల్‌ను కేవలం 12 శాతం మాత్రమే ఉపయోగిస్తుండగా.. డీజిల్‌ను మాత్రం 40 శాతంగా ఉపయోగిస్తున్నారు. డీజిల్ రేట్లు పెరిగితే ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుంది. డీజిల్ పెంపు వల్ల ఉత్పత్తుల రవాణా వ్యయం పెరగడంతో పాటుగా ఉత్పత్తుల రేటు కూడా పెరుగుతుంది. ఫలితంగా వ్యవసాయోత్పత్తులు ధరలు కొండెక్కుతాయి. ఉదాహరణకు డీజిల్ ధర లీటరుకు నాలుగు రూపాయలు పెరిగితే, ఆహారధాన్యాల రేటు రెండు రూపాయలు పెరుగుతుంది. రవాణా సాధనాల్లో ప్రధానమైన ట్రక్కుల విషయం తీసుకున్నప్పుడు లీటరు డీజిల్‌కు మూడు కిలోమీటర్ల మైలేజి వస్తుందనుకుంటే.. రేట్ల పెంపు వల్ల ప్రతి 3 కిలోమీటర్ల ప్రయాణంపై రూ.4 అదనపు వ్యయం అవుతుంది. ఫలితంగా దూర ప్రాంతాలకు చేరవేసే వస్తువుల రేట్లూ భారీగా పెరుగుతాయి.
ఈ కారణాల వల్ల మళ్లీ పైకి ఎగబాకిన ద్రవ్యోల్బణాన్ని కిందకు తెచ్చేందుకు ఆర్‌బిఐ మరోసారి 'వడ్డిం'పులు ప్రారంభించక తప్పదు. ఫలితంగా రుణాలు మరింత ప్రియం అవుతాయి. డీజిల్ ధరల పెంపు మరీ ముఖ్యంగా.. అసలే కష్టాల్లో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమపై గుదిబండలా మారుతుంది. ఒక్క డీజిల్ ధర పెంపుపై ఇన్ని అంశాలు ఆధారపడి ఉండటం వల్లే ప్రభుత్వం ఈ విషయంలో దోబూచులాట ఆడుతోంది. ఈ కోవలోనే గురువారం జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడింది. డీజిల్ ధర పెరిగితే ఎటుతిరిగి జీవితం చిక్కుల్లో పడుతుండనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.


Click it and Unblock the Notifications








