గతంలో జరిగిన తప్పులు పునరావృతం కావు: జనరల్ మోటార్స్

స్థానికంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు జనరల్ మోటార్స్ ఇటీవల భారత్‌లో ఇంజన్‌ల తయారీని చేపట్టింది. అంతేకాకుండా.. చైనా, బ్రెజిల్, రష్యా దేశాలలో తమ మార్కెట్ వాటాను స్థిరంగా ఉంచుకునేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఉత్పత్తుల శ్రేణి (ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో), వనరుల కేటాయింపులలో తప్పులు దొర్లాయని, దాని ఫలితం కంపెనీ వృద్ధిపై పడిందని జనరల్ మోటార్స్ అంతర్జాతీయ అధ్యక్షుడు తెలిపారు. ఇకపై తాము రూపొందించబోయే ఉత్పత్తులు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
గత దశాబ్దంలో ప్యాసింజర్ వాహన విభాగంలో బ్రెజిల్‌లో 20 శాతం, చైనాలో 13 శాతం, రష్యాలో 9 శాతం మార్కెట్ వాటాలను జనరల్ మోటార్స్ కలిగి ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే.. గడచిన 14 ఏళ్లుగా భారత్‌లో ఉన్నప్పటికీ ఇక్కడ తక్కువగా వనరులను కేటాయించడం, నిర్ధిష్ట లక్ష్యాలను నిర్దేశించకపోవడం వల్ల ఇప్పటి వరకూ కేవలం 4 శాతం మార్కెట్ వాటాను మాత్రమే చేరుకోగలిగామని, ప్యాసింజర్ కార్ సెగ్మెంట్‌లో 2010 వరకూ 23 లక్షల యూనిట్లను మాత్రమే విక్రయించగలిగామని ఆయన చెప్పారు. భారత మార్కెట్లో దీర్ఘకాలం నిలబడేందుకు అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.
కొత్తగా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను భారత మార్కెట్ కోసం స్థానికంగా రూపొందించామని, 'బీట్'కు ఇది సరైన ఇంజన్ అని, దీనిని ఎగుమతి కూడా చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జనరల్ మోటార్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ఇందులో డీజిల్ వర్షన్ ఇంజన్ కూడా మరో ఆరు నెలల్లో మార్కెట్లోకి అందుబాటులోకి రానుందని, తాలేగావ్‌లో ఉన్న ప్లాంటులో ఈ రెండు రకాల ఇంజన్‌లను తయారు చేస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications








