వచ్చే వారంలో వాహన ధరలను పెంచనున్న మారుతి సుజుకి..!?

కేవలం ఒక్క మారుతి సుజుకి మాత్రమే కాకుండా.. ఈ ఏడాది దాదాపు అన్ని మోటార్ కంపెనీలు ధరలను పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఉత్పాదక వ్యయం (ఇన్‌పుట్ కాస్ట్) పెరగడమే ఇందుకు ముఖ్య కారణం. మొత్తం మీద ఆటోమొబైల్ కంపెనీలు ఒకటి నుంచి రెండు శాతం మేర దరలను పెంచే అవకాశాలున్నాయి. భారత్ కార్ మార్కెట్లో లీడర్‌గా ఉన్న మారుతి సుజుకి ఇప్పటికే తమ వాహన ధరలను సవరించింది. వచ్చే వారంలో కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.
అయితే ధరలను ఎంత మేరకు పెంచాలనే అంశంపై మాత్రం కంపెనీ బోర్డు సమావేశం అనంతరమే ఓ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. గత సెప్టెంబర్ 2010తో ముగిసిన త్రైమాసిక ఫలితాల తర్వాత కూడా మారుతి ఇలాంటి ప్రకటనే చేసింది. ఆ త్రైమాసికంలో మారుతి నికరలాభం కేవలం 4.95 శాతం మాత్రమే వృద్ధి చెంది 598.20 కోట్లకు పెరిగింది. ఏదేమైనప్పటికీ.. 2010లో మారుతి కమోడిటీలపై రూ. 6938.88 కోట్లను, ముడి సరుకులపై రూ. 5254.89ను ఖర్చు చేసింది. ఫలితంగా 2010లో రెండుసార్లు ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలా కార్ల ధరలను పెంచిన జాబితాలో కేవలం మారుతి మాత్రమే కాకుండా.. మహీంద్రా అండ్ మహీంద్రా, హుందాయ్, టాటా మోటార్స్, జనరల్ మోటార్స్ వంటి ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలు కూడా ఇదే కారణం (ఇన్‌పుట్ కాస్ట్)తోనే ధరలను పెంచాయి. ఈ ధరాఘాతంతో 2010లో ప్రోత్సాహకర (30 శాతం) వృద్ధిని కనబరచిన ఆటోమొబైల్ మార్కెట్లు 2011లో నెమ్మదించే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications








