చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కొడా ఆటో ఇండియా (ఫోక్స్‌వ్యాగన్ అనుబంధ సంస్థ) మే నెల విక్రయాలలో 100 శాతం వృద్ధిని సాధించి 2,761 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయానికి కంపెనీ విక్రయాలు కేవలం 1,381 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ సందర్భంగా స్కొడా ఆటో ఇండియా బోర్డు సభ్యులు (సేల్స్ అండ్ మార్కెటింగ్) థామస్ కూయెల్ మాట్లాడుతూ.. "మే, 2011 నెలకు గానూ 100 శాతం విక్రయ వృద్ధిని సాధించినట్లు ప్రకటించడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. దేశవ్యాప్తంగా మా డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లను శరవేగంగా విస్తరించడం ద్వారా ఈ వృద్ధిని సాధించగలిగాం" అని ఓ ప్రకటనలో తెలిపారు.
భారత మార్కెట్లో తమ సెగ్మెంట్లలో లీడర్‌గా ఎదిగేందుకు స్కొడా కంపెనీ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో కూడా ఇదే వృద్ధి కొనసాగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే ఢిల్లీలో కొత్తగా స్కొడా ఓ డీలర్‌షిప్‌ను ఏర్పాటు చేసింది, ఇలాంటివే మరికొన్ని డీలర్‌షిప్‌లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 2018 నాటికి ప్రపంచవ్యాప్త విక్రయాలను రెండితలకు పెంచుకొని కనీసం 15 లక్షల వాహనాలను విక్రయించాలని స్కొడా లక్ష్యంగా పెట్టుకుంది.