హోండా సిటీ భరతం పట్టేందుకు వస్తున్న స్కొడా ప్రిమీయం సెడాన్

చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీదారు 'స్కొడా ఆటో' (ఫోక్స్‌వ్యాగన్ అనుబంధ సంస్థ) ఈ ఏడాది చివరినాటికి దేశీయ మార్కెట్లో ఓ మిడ్-సైజ్ సెడాన్ కారును ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఈ విభాగంలో రాణిస్తున్న హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, హ్యుందాయ్ వెర్నా, ఫోర్డ్ ఫియస్టాలకు గట్టి పోటీ ఇచ్చే విధంగా స్కొడా ఓ సెడాన్ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం స్కొడా అందిస్తున్న సెడాన్ వేరియంట్ 'ఆక్టావియా' స్థానంలో దీన్ని ప్రవేశపెట్టబోమని, ఆక్టావియా ఉత్పత్తి/విక్రయాలు యధావిధంగానే ఉంటాయని కంపెనీ తెలిపింది.
స్కొడా ఆటో ఇండియా బోర్డు సభ్యులు, సేల్స్ అండ్ మార్కెటింగ్ థామస్ కూయెల్ మాట్లాడుతూ.. స్కొడా కొత్త సెడాన్ కారును తొలుతగా సెప్టెంబర్‌లో జరగబోయే ఫ్రాంక్‌ఫర్ట్ ఆటో షోలో ప్రదర్శిస్తామని, ఈ సెడాన్ కారును పొందే తొలి మార్కెట్లలో భారత్ కూడా ఒకటని తెలిపారు. తమ కొత్త సెడాన్‌పై వెచ్చించిన నగదుకు అంతే విలువైన ఫలితం ఉంటుందని, ఈ విభాగంలో అగ్రస్థానం కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి ప్రీమియం విభాగంలో తమ ఉత్పత్తులు లభ్యమవుతున్నాయని, కంపెనీ అందిస్తున్న స్కొడా లారా, స్కొడా సూపర్బ్ కార్లు క్వాలిటీ, డిజైన్, డ్రైవబిలిటీ, ఎక్విప్‌మెంట్‌ల విషయంలో తమ పోటీదారులతో పోలిస్తే ఉత్తమమైనవని అన్నారు.
కాగా.. కొత్తగా ప్రవేశపెట్టబోయే సెడాన్ కారును కూడా ఇవే అంశాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించినట్లు కూయెల్ వెల్లడించారు. కొత్త సెడాన్ కారును ఫోక్స్‌వ్యాగన్ వెంటో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించనున్నారు. ఇది కూడా పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభ్యం కానుంది. ఇప్పటికే ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న హోండా సిటీ సెడాన్‌ను గత నెలలో ఫోక్స్‌వ్యాగన్ వెంటో వెనక్కు నెట్టి అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. మరి కొత్తగా జెర్మన్ టెక్నాలజీతో వస్తున్న స్కొడా సెడాన్ కారుతో తలపడి హోండా సిటీ నిలబడగలా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోనుంది.


Click it and Unblock the Notifications








