ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, కారు మరియు ఇంజన్ విడిభాగాల తయారీ సంస్థ సోనాలికా ఇప్పుడు అమెరికా మార్కెట్‌పై కన్నేసింది. అమెరికాలో ట్రాక్టర్ మరియు ఇంజన్ల కోసం అసెంబ్లింగ్ ప్లాంటును ఏర్పాటు చేసేందకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. రానున్న ఆరు నెలల్లో ఈ ప్లాంటును ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనిపై కంపెనీ గ్రూప్ ఛైర్మన్ ఎల్.డి. మిట్టల్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "మా ఇంజన్లకు పర్యావరణ పరిరక్షణ సంస్థ, వాషింగ్టన్ నుంచి అనుమతి లభించింది. అమెరికా మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇది మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే మేము జనరల్ మోటార్స్‌తో డీజిల్ ఇంజన్‌ల సరఫరా కోసం ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాం, ఏటా 40,000 ఇంజన్‌లను సరఫరా చేయగలమని మేము భావిస్తున్నామ"ని అన్నారు.
అమెరికా ప్లాంటు కోసం సోనాలికా రూ. 100 కోట్లను పెట్టుబడిగా వెచ్చించనుంది. ఇందులో కొంత భాగాన్ని అంతర్గతంగానూ, మరికొంత భాగాన్ని రుణాల ద్వారా సేకరించాలని కంపెనీ యోచిస్తోంది. అధిక నాణ్యత మరియు పోటీతత్వ ధరల కారణంగా అమెరికాలో భారతీయ ట్రాక్టర్లకు మంచి డిమాండ్ ఉందని, కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్ (సికెడి) రూపంలో వీటినికి అమెరికా ఎగుమతి చేయనున్నామని మిట్టల్ తెలిపారు. టర్కీ మరియు రోమానియా దేశాల్లో కూడా ట్రాక్టర్ అసెంబ్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.