సునామీ తాకిడి తర్వాత ఉత్పత్తి మళ్లీ ప్రారంభించిన సోనీ, నిస్సాన్

ఉత్తర జపాన్‌లోని తోచిగిలో ఉన్న రీచార్జబుల్ బ్యాటరీల తయారీ కర్మాగారాన్ని ఈ నెల 22 నుంచి తిరిగి తెరవనున్నట్లు సోనీ వర్గాలు వెల్లడించాయి. సునామీ తర్వాత మొత్తం 10 ప్లాంట్లను సోనీ మూసేసింది. అదేవిధంగా జపాన్‌లోని రెండో అతిపెద్ద వాహన కంపెనీ అయిన నిస్సాన్.. ఆరు ప్లాంట్లలో ఉత్పత్తిని నేటి నుంచి మళ్లీ ప్రారంభిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 11న జపాన్‌ను కుదిపేసిన భయంకరమైన భూకంపం, సునామీల ప్రభావంతో అనేక జపనీస్ కంపెనీలు ప్లాంట్లలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే.
విద్యుత్ కట్...: జపాన్‌లోని చాలా అణువిద్యుత్ ప్లాంట్లు మూతబడడంతో కంపెనీలు తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇవాకీ ప్రాంతంలో నిస్సాన్ ప్లాంట్లకు విద్యుత్ కోత తీవ్ర ఆటంకం కలిగిస్తోందని... తగినంత నీరు, గ్యాస్ కూడా అందుబాటులో లేనట్లు ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు చెబుతున్నారు. కాగా, ప్రపంచంలో మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన టయోటా మోటార్స్ కూడా తన 21 వాహన, విడిభాగాల ప్లాంట్లను ఈ నెల 22 వరకూ మూసి ఉంచనున్నట్లు ఇదివరకే తెలిపింది.


Click it and Unblock the Notifications








