దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న క్రాసోవర్ మోడల్ 'టాటా ఆరియా' విక్రయాలను పెంచుకునేందుకు ఈ మోడల్‌ను తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో ఆరియా బ్రాండ్‌లో మరో చౌక వేరియంట్‌ను ప్రస్తుత నెలలో కంపెనీ విడుదల చేయనుంది. కొత్తగా రానున్న ఈ చౌక వేరియంట్ ఆరియా టూ-వీల్-డ్రైవ్ ఆప్షన్‌ను కలిగి ఉండి ధర దాదాపు రూ. 10-11 లక్షలు మధ్య ఉండవచ్చునని అంచనా. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాటా ఆరియా 2.2 లీటర్ డైకార్ ఇంజన్‌తో ఫోర్-వీల్-డ్రైవ్‌ను కలిగి ఉండి ధర రూ. 13.54-16.20 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై) మధ్య ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టూ-వీల్ డ్రైవ్ వెర్షన్ ఆరియా విడుదల చేస్తామని టాటా మోటార్స్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) గణాంకాల ప్రకారం, టాటా మోటార్స్ యొక్క ఆరియా మరియు జెనాన్ మోడళ్ల ఏప్రిల్ మరియు మే నెల దేశీయ విక్రయాలు మొత్తం 343 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్ నెలలో ఆరియాను టాటా మోటార్స్ విడుదల చేసింది.