టాటా నానో టైమ్ బాగోలేదు: లంకలోనూ తగలబడిన 'నానో'

ది సండే లీడర్ అనే శ్రీలంక పత్రిక ప్రచురించిన వివరాల ప్రకారం, 'బడ్జెట్ టాక్సీ' కంపెనీకు చెందిన ఓ టాటా నానో కారు గడచిన శుక్రవారం (సెప్టెంబర్ 2, 2011) రోజున లేడెన్ బస్టియన్ మవాతా, ఫోర్ట్ సమీపంలో కాలి బుడిదైనట్లు ప్రచురించింది. ఈ విషయంపై బడ్జెట్ టాక్సీ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, అగ్రి ప్రమాదం సంభవించిన సమయంలో కారులో ప్రయాణీకులు ఎవరూ లేరని తెలిపారు.
బడ్జెట్ టాక్సీ డైరెక్టర్ కెలుమ్ జయసుమనా స్పందిస్తూ.. అసలు కారులో ఎందుకు మంటలు చెలరేగాయో గుర్తించాల్సి ఉందని అన్నారు. టాటా నానో కారు హఠాత్తుగా ఆగిపోయి, ఉన్నట్టుండి మంటలు చెలరేగాయని సదరు కారును నడుపుతున్న డ్రైవర్ చెప్పాడని జయసుమనా తెలిపారు. ఈ విషయంపై భారత్‌లోని టాటా నానో కంపెనీను సంప్రదించామని, కంపెనీ అధికారులు శ్రీలంకకు వచ్చి ప్రమాదానికి గల కారణాలను గుర్తించనున్నారని ఆయన చెప్పారు.
మనదేశంలో ముంబై, గుజరాత్, న్యూఢిల్లీ, వడోదరా వంటి నగరాల్లో కూడా గతంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. టాటా నానోకు శ్రీలంక తొలి విదేశీ మార్కెట్. ఇటీవలే లంక మార్కెట్లోకి ప్రవేశించిన చిన్న కారు అక్కడి మార్కెట్లో బాగా రాణిస్తున్న తరుణంలో తాజా సంఘటన టాటా మోటార్స్ మరింత తలనొప్పిగా మారనుంది. ఇప్పటికే అమ్మకాలు లేక విలవిలాడుతున్న టాటా నానోపై ఈ తాజా సంఘటనలు మరింత ప్రభావం చూపే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications