మాట మార్చిన మమత..: ఘాటుగా సమాధానం చెప్పిన టాటా

ఇంకా ఈ బిల్లులో టాటా మోటార్స్ వారి నానో ప్రాజెక్టును అభివృద్ధి చేయడంలేదని, పూర్తిగా నిలిపి వేసిందని, అంతేకాకుండా.. దీనివల్ల సామాజిక-ఆర్థిక అభివృద్ధి పరంగా స్థానికంగా ఉండే ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరదని ప్రభుత్వం తెలిపింది. అయితే మమతా బెనర్జీ పాస్ చేసిన బిల్లుపై టాటా మోటార్స్‌కు ఘాటుగా స్పందించింది. సింగూరు ప్లాంటు ద్వారా అక్కడి ప్రజల అభివృద్ధి కోసం తాము చేసిన కృషి, ఈ ప్లాంటు ఏర్పాటులో ఎదురయిన చేదు అనుభవాలను కంపెనీ వెల్లడించింది. ఆగస్టు 2008లో సింగూర్ ప్లాంటు కార్యకలాపాలను ప్రారభించిన టాటాకు ఆది నుంచి ఆటంకాలే ఎదురయ్యాయి.
ఈ ప్లాంటు ఏర్పాటు సమయంలో జరిగిన అల్లర్లు, కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం, వ్యక్తిగతంగా బెదిరించడం, ఆస్తి నష్టం, హైవేలను బ్లాక్ చేయడం వంటి ఎన్నో క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్లాంటు ఏర్పాటు దాదాపుగా పూర్తి చేసి ట్రైల్ ప్రొడక్షన్ రన్ చేస్తున్న సమయంలో తమను అక్కడ నుండి వెళ్లగొట్టారని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. సింగూర్ నానో ప్లాంటు ఏర్పాటు కోసం రూ. 1,800 కోట్లను పెట్టుబడిగా వెచ్చించామని, దీని ద్వారా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడేవని కంపెనీ పేర్కొంది. ప్లాంటు ఏర్పాటు కన్నా ముందుగానే డిసెంబర్ 2006లో టాటా మోటార్స్ సింగూర్ ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో అభివృద్ధి పధకాలను కూడా చేపట్టింది.
ఉపాది కల్పన, సెల్ఫ్-ఎంప్లాయిమెంట్, విద్య మరియు వైద్యం వంటి విషయాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. ఉపాది పనుల్లో దాదాపు 767 మందికి శిక్షణ ఇచ్చామని, సుమారు 102 హెల్త్ క్లినిక్‌ల ద్వారా 17,000 మందికి పైగా రోగులకు ఆరోగ్య సేవలందించామని, పరిసర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు మద్దతు తెలిపామని టాటా పేర్కొంది. ఇన్ని అభివృద్ధి ప్రణాళికలు చేపట్టిన టాటా మోటార్స్‌పై మమత అధికారంలో లేనప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట వ్యక్తం చేయడంపై కంపెనీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. సింగూర్ నానో ప్లాంటును ఎందుకు ఆపేయాల్సి వచ్చిందో, అక్కడి నుంచి గుజరాత్‌లోని సనంద్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో మాత్రం సదరు బిల్లు వివరించకపోవడం ఇందులో కొసమెరుపు.


Click it and Unblock the Notifications








