భారత్‌లో టాప్ 10 విలాసవంతమైన కార్లు ఇవే..!!

1. మెర్సిడెస్ మేబాచ్:
మెర్సిడెస్ బెంజ్ కంపెనీ 2009లో ఆపివేసిన మేబాచ్‌ను మరోసారి భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యంత విలాసవంతమైన హంగులతో ఈ కారును రూపొందించారు. ఇంతవరకూ భారత్‌లో మేబాచ్ యజమానులు కేవలం ఒక అంకె సంఖ్యలో మాత్రమే ఉన్నారంటే.. ఇది ఎంత విలాసంవంతమైన కారో ఇట్టే తెలిసిపోతుంది. మేబాచ్‌లో రెండు వేరియంట్లు లభిస్తాయి. మొదటిది మేబాచ్ 57, రెండవది మేబాచ్ 62. ఈ నెంబర్ల అర్థం ఏంటంటే.. మేబాచ్ 57 కారు 5.7 మీటర్ల పొడవును, అలాగే మేబాచ్ 62 కారు 6.2 మీటర్ల పొడవును కలిగి ఉంటుందని అర్థం. ఈ కారును వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా అత్యంత విలాసవంతంగా మార్చేసుకోవడం దీని అదనపు ప్రత్యేకత.
ఇక దీని ధర విషయానికి వస్తే... రూ. 5,50,00,000 (అబ్బో చాలా సున్నాలు ఉన్నాయి కదా... సింపుల్‌గా చెప్పాలంటే 5.5 కోట్లు మాత్రమే)
2. బెంట్లీ అజూర్:
ఇంగ్లాండ్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ "బెంట్లీ" 2003 నుంచి భారత్‌లో ఉంది. దేశంలోని అత్యంత ధనికులను ఉద్దేశించి "అజూర్" అనే లగ్జరీ కారును బెంట్లీ ప్రవేశపెట్టింది. అంతేకాదండోయ్... బెంట్లీ ఆ ఈ కార్లను పరిమితంగానే విక్రయిస్తుంది. ఈ కారులో ఇద్దరికీ మాత్రమే చోటు ఉంటుంది. 5.9 లీటర్ ఇంజన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, 552 హార్స్‌పవర్ సామర్థ్యంతో గంటకు 317 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించడం దీని ప్రత్యేకత. మిగతా లగ్జరీ కార్లలో మాదిరిగానే ఇందులో కూడా అన్ని సదుపాయాలు విలాసవంతంగానే ఉంటాయి.
ఇద దీని ధర విషయానికి వస్తే.. రూ. 3,50,00,000 అంటే 3.5 కోట్ల రూపాయలన్నమాట.
3. రోల్స్ రాయిస్ ఫాంటమ్:
దాదాపు 50 ఏళ్ల విరామం తర్వాత రోల్స్ రాయిస్ మోటార్ కార్లు "ఫాంటమ్" అనే సూపర్ లగ్జరీ సెడాన్ విడుదల ద్వారా తిరిగి భారత్‌లోకి ప్రవేశించాయి. ఫాంటమ్ కారును ప్రత్యక్షంగా చూస్తే.. మరో లగ్జరీ కారును చూడనవసరంలేదని ఆటో నిపుణులు అంటుంటారు. అంటే ఇది తొలిచూపులోనే చూపరులను కట్టిపడేస్తుందన్నమాట. ఫాంటమ్ కారు 19 అడుగులు పొడవు ఉంటుంది (బిఎమ్‌డబ్ల్యూ 760 ఎల్ఐ కన్నా ఇది రెండు అడుగుల ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది). ఇది 6.75 లీటర్ వీ-12 ఇంజన్‌తో 453 హార్స్‌పవర్ సామర్థ్యాన్ని కలిగి దేశంలో మూడవ అత్యంత విలాసవంతమైన కారుగా ఉంది.
ఇక దీని ధర విషయానికి వస్తే.. రూ. 3,50,00,000 అంటే 3.5 కోట్ల రూపాయలన్నమాట.
4. లాంబోర్గిని మెర్సిలాగో:
ఇటలీకు చెందిన ఆటోమొబైల్ సంస్థ లాంబోర్గిని రూపొందించిన సూపర్ లగ్జరీ కారు "మెర్సిలాగో". పైవైపు తెరుచుకునే రెండు డోర్లు కలిగిన ఈ కారును అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు. భారత్‌లో లభిస్తున్న ఈ సూపర్‌కారు 6.5 లీటర్, 12-సిలిండర్ ఇంజన్, 631 హార్స్‌పవర్, 8,000 ఆర్‌పిఎమ్ సామర్థ్యంతో గంటకు సుమారు 340 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది కేవలం 3.4 సెకన్ల వ్యవధిలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
భారత్‌లో దీని ధర రూ. 3,00,00,000 (3 కోట్లు)గా ఉంది.
5. బెంట్లీ ఆర్నెగ్:
భారత్‌లో అత్యంత వేగంగా ప్రయాణించే కార్లలో బెంట్లీ ఆర్నెగ్ కూడా ఒకటి. ఇది గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఐదవ అత్యంత విలాసవంతమైన కారు. ఇది 6.7 లీటర్ వీ-8 టర్బోచార్జ్‌డ్ ఇంజన్‌తో 400 హార్స్‌పవర్ సామర్థ్యాన్ని, 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ కలిగి ఉండి భారత్‌లో రియర్-వీల్-డ్రైవ్ మోడల్‌లో లభిస్తుంది.
దీని ధర రూ. 2,75,00,000 (2.75 కోట్లు)గా ఉంది.
6. బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పౌర్:
లగ్జరీ కార్లను వాడి బోర్ కొట్టేసిన వారికి.. ఆర్థికంగా కొంత ఎదుగుదల ఉన్న వారికి మరో సరికొత్త సూపర్ లగ్జరీ కారు అందుబాటులో ఉంది. అదే "బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పౌర్", గత 2006 విడుదలైన ఈ కారు విలాసాలను కోరుకునే వాహన ప్రియుల కోరికలను చక్కగా నెరవేర్చుతుంది. ఫోర్-వీల్ డ్రైవ్ మోడల్‌లో లభించే ఈ సూపర్ లగ్జరీ కారు 5.9 లీటర్ టర్బోచార్జ్‌డ్ ఇంజన్‌తో 553 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగి ఉండి, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్‌తో గంటకు 312 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది కేవలం 4.9 సెకండ్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
ఇక దీని ధర విషయానికి వస్తే.. రూ. 2,00,00,000 (2 కోట్లు)గా ఉంది.
7. పోర్షే కరేరా జిటి:
పోర్షే కరేరా జిటి కారు అత్యంత విలాసవంతమైన స్పోర్ట్స్ కార్. దీని బాడీ డిజైన్ వాస్తవానికి భారత రోడ్లకు సరిపోదు. దీని రోడ్ క్లియరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా మన ట్రాఫిక్‌లో దీని వేగాన్ని అదుపు చేయడం కూడా కష్టమే. ఇది గంటకు 330 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులో ఉన్న మరో చిక్కు ఏంటంటే.. ఇది 93-ఆక్టేన్ పెట్రోల్‌తో మాత్రమే నడుస్తుంది. ఈ పెట్రోల్ ఢిల్లీ, ముంబైలలో మాత్రమే లభిస్తుంది. ఇది నాలుగు సెకన్లలోపే 100 కిలోమీటర్ల వేగాన్ని, 10 సెకన్లలోపే 192 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో ఆరు గేర్లు ఉంటాయి.
ఇక ధర విషయానికి వస్తే.. రూ. 1,75,00,000 (1.75 కోట్లు) మాత్రమే.
8. మెర్సిడెస్ ఎస్-క్లాస్:
కోటి రూపాయల కన్నా తక్కువ ధరలో లభించే విలాసవంతమైన కార్లలో మెర్సిడెస్ ఎస్-క్లాస్ ఒకటి. ముఖ్యంగా వ్యాపారవేత్తలను ఉద్దేశించి రూపొందించిన ఈ కారులో అన్నిరకాల భద్రతా సదుపాయాలతో విలాసంతో కూడిన సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. ఇది 3.5 లీటర్ వీ-6 పెట్రోల్ ఇంజన్‌తో 272 హార్స్‌పవర్ సామర్థ్యంతో 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ సదుపాయంతో లభిస్తుంది.
దీని ధర రూ. 77,00,000 (77 లక్షలు)
9. బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్:
తక్కువ ధరలో విలాసవంతమైన కార్లను కోరుకునే వారి కోసం బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారును అందిస్తోంది. సూపర్ లగ్జరీ సదుపాయాలు కోరుకునే వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఇది లభిస్తుంది. సరికొత్త లుక్‌తో అత్యాధునిక టెక్నాలజీతో ఇవి నాలుగు వేరియంట్లలో లభిస్తాయి. 3 లీటర్ ఇన్‌లైన్ డీజిల్ ఇంజన్, 4లీటర్ వీ-8 పెట్రోల్ ఇంజన్, 4.8 లీటర్ వీ-8 పెట్రోల్ ఇంజన్, 6.0 లీటర్ వీ-10 పెట్రోల్ ఇంజన్‌లతో అన్ని మోడళ్లు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి.
వీటి ధరలు రూ. 75,00,000 (75 లక్షల) నుండి ప్రారంభమవుతాయి.
10. ఆడి ఏ8:
జర్మనీకు చెందిన ఆడి కంపెనీ తాజాగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన లగ్జరీ కారు "ఆడి ఏ8". అత్యాధునిక టెక్నాలజీ, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్‌తో ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. 3.0 లీటర్ వీ-6 టర్బో డీజిల్ ఇంజన్ సామర్థ్యంతో లభించే కారు 228 హార్స్‌పవర్‌ను, అలాగే 6.0 లీటర్ డబ్ల్యూ-12 ఇంజన్ సామర్థ్యంతో లభించే కారు 450 హార్స్‌పవర్‌ను జనరేట్ చేస్తాయి. ఈ రెండు మోడళ్లు కూడా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి.
ఇద ధీని ధర రూ. 70,00,000 (70 లక్షల) నుండి ప్రారంభం అవుతుంది.


Click it and Unblock the Notifications








