టొయాటా ఉత్పత్తుల్లో రీకాల్ పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా.. జపాన్ మరియు కొన్ని విదేశీ మార్కెట్లలో విక్రయించిన లక్షకు పైగా ప్రయస్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు టొయోటా మోటార్ కార్పోరేషన్ ప్రకటించింది. ప్రయస్ కార్లలో గేర్‌బాక్స్, స్టీరింగ్‌లలో తలెత్తున్న సమస్యలను సరిచేసేందుకు 1,05,784 ప్రయస్ కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 1997లో విడుదలైన మొదటితరం (ఫస్ట్ జనరేషన్) ప్రయస్ కార్లకు ఈ రీకాల్ వర్తించనుంది. జపాన్‌లో 47,787 కార్లను, అమెరికాలో 52,000, అలాగే బ్రిటన్, జర్మనీలలో విక్రయించిన మిగిలిన 5997 కార్లు ఈ రీకాల్ కిందకు రానున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
అంతేకాకుండా 2008-09 మధ్య కాలంలో జపాన్‌లో టొయోటా విక్రయించిన చిన్న కారు ఐక్యూ (iQ)ను కూడా 33,636 యూనిట్లను రీకాల్ చేసింది. గత నెలలో 'ప్రసయ్ ఆల్ఫా' అనే ఒక 5 సీటర్ మరియు ఒక 7 సీటర్ వాహనాలు విడుదల చేయడం ద్వారా ప్రయస్ బ్రాండ్ ప్రస్థానాన్ని కంపెనీ విస్తరించింది. టొయోటా ప్రపంచ వ్యాప్తంగా ఏటా కనీసం 10 లక్షల హైబ్రిడ్ వాహనాలను విక్రయించాలని భావిస్తోంది. ఈ రీకాల్‌కు సంబంధించి ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.