టాక్సీ స్పెషల్‌గా రీఎంట్రీ ఇవ్వనున్న పాత స్విఫ్ట్ డిజైర్
మారుతి సుజుకి ఇండియా కొత్తగా స్విఫ్ట్ డిజైర్ సెడాన్ తోకను కత్తిరించి కాంపాక్ట్ సెడాన్‌గా తీర్చిదిద్ది 2012 వెర్షన్ పేరుతో నిన్న (బుధవారం) మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, మరి పాత స్విఫ్ట్ డిజైర్‌ను ఏం చేస్తుంది. కొంపదీసి ఉత్పత్తిని నిలిపివేస్తుందా..?? ఆ.. కంగారు పడకండి. పాత స్విఫ్ట్ డిజైర్ ఎక్కడి పోదు. మరో కొత్త పేరుతో, సరికొత్త రూపంలో తిరిగి మార్కెట్లోకి రానుంది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇప్పటికీ పాత స్విఫ్ట్ డిజైర్‌కు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో పాత స్విఫ్ట్ డిజైర్‌ను కొనుగోలుదారులకు దూరం చేయకూడనే ఉద్దేశ్యంతో మారుతి సుజుకి ఈ మోడల్‌ను రీనేమ్ చేసి, టాక్సీ స్పెషల్‌గా రీపొజిషనింగ్ చేయనుంది. ఇందుకు ప్రధానం కారణం డిజైర్ యొక్క మెయింటినెన్స్ ఖర్చు తక్కువగా ఉండటం, అధిక మైలేజ్‌ను ఇవ్వటమే.
అంతేకాకుండా.. ఇందులో ఉండే విశాలమైన బూట్ స్పేస్ (400 లీటర్లకు పైగా) కూడా ఈ కారును టాక్సీగా వాడుకునేందుకు చక్కగా సరిపోతుంది. అన్నింటికన్నా మించి, ఎక్కడైనా అందుబాటులో ఉండే మారుతి సుజుకి సర్వీస్ సెంటర్లు దీన్ని టాక్సీగా ఉపయోగించుకునేందుకు మంచి అవకాశాలను కల్పిస్తాయి. మహీంద్రా లోగాన్, టాటా ఇండిగో సిఎస్ వంటి ఎంట్రీ లెవల్ టాక్సీ సెడాన్‌లకు పాత స్విఫ్ట్ డిజైర్ గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications









