నానో కారును ప్రశంసించిన అమెరికా ఉన్నతాధికారి
టాటా నానో కారును మన మార్కెట్లో ఆదరణ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ (టాటా మోటార్స్ ఊహించిన స్థాయిలో లేదు) అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే ఈ మేడ్ ఇన్ ఇండియా బుజ్జి కారుపై పలు పొరుగు దేశాలు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, ప్రపంచపు అగ్రగామి దేశమైన అమెరికా ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి టాటా నానోకు మద్దతు పలికారు. అమెరికా ప్రభుత్వపు ఆర్థిక వృద్ధి, విద్యుత్, పర్యావరణ శాఖలకు కార్యదర్శి అయిన రాబెర్ట్ డి హార్‌మ్యాట్స్ టాటా మోటార్స్ చైర్మన్ రతన్ టాటా డ్రీమ్ కార్ ప్రాజెక్ట్ నుండి వెలువడిన నానో కారును ప్రశంసలతో ముంచెత్తారు. లో-కాస్ట్-కార్ కోసం టాటా నానో కొత్త పరిమితులను (స్టాండర్డ్స్) సృష్టించిందని ఆయన వ్యాఖ్యానించారు.
"ఇండియన్ టాటా మోటార్స్ ద్వారా అభివృద్ధి చేయబడి తయారైన నానో తక్కువ ధర కలిగిన వాహనాల కోసం కొత్త గ్లోబల్ స్టాండర్డ్స్‌ను సృష్టించింద" హార్‌మ్యాట్స్ అన్నారు. అమెరికన్ మార్కెట్లో కూడా నానో కారును ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని టాటా మోటార్స్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాటా నానో శ్రీలంక, నేపాల్ మార్కెట్లలో లభ్యమవుతుంది. యూరప్ మార్కెట్ కోసం కూడా నానో యూరోపా అనే కాన్సెప్ట్‌ను టాటా మోటార్స్ అభివృద్ధి చేసింది.


Click it and Unblock the Notifications









