టిటి స్పోర్ట్స్ కారును విడుదల చేసిన ఆడి ఇండియా
టిటి స్పోర్ట్స్ కారును ఆడి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియూ) రూట్లో దిగుమతి చేసుకుని రానున్న జూన్ నెల నుండి దేశీయ విపణిలో విక్రయించనుంది. భారత మార్కెట్లో టిటి స్పోర్ట్స్ కార్ ధరను రూ.48.36 లక్షలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా నిర్ణయించామని కంపెనీ తెలిపింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2012-13లో దిగుమతి చేసుకున్న కార్లపై సుంఖాన్ని 60 శాతం నుండి 75 శాతానికి పెంచిన నేపథ్యంలో, ఈ పెంపును కూడా పరిగణలోకి తీసుకునే టిటి స్పోర్ట్స్ కార్ ధరను నిర్ణయించామని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు. ఇటీవలే ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న అన్ని ఇతర మోడళ్ల ధరలను 14 శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే.
భారత మార్కెట్లో ఆడి ఇప్పటికే ఆర్8, ఆర్8 స్పైడర్, ఆర్‌ఎస్5 అనే ప్రమీయం స్పోర్ట్స్ కార్లను విక్రయిస్తుంది. టిటి స్పోర్ట్స్ కార్ రాకతో ఈ సెగ్మెంట్లో తమ స్థానం మరింత పటిష్టం కాగలదని ప్రెస్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రీమియం స్పోర్ట్స్ కార్ సెగ్మెంట్లో ఏటా 200-250 కార్లు అమ్ముడవుతాయని, ప్రస్తుత సంవత్సరంలో 25-35 ఆడి టిటి కార్లను విక్రయించవచ్చని అంచనా వేస్తున్నామని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications









