దమ్ములో ఎన్టీఆర్, త్రిషలు వాడిన వాహనాల గురించి తెల్సా..?
సాధారణంగా ఎవరైనా సినిమాకి వెళ్తే హీరో చేసే యాక్షన్ సన్నివేశాలనో లేక హీరోయిన్ ప్రదర్శించే అందాలనో లేక కెమెరాన్ చూపించే ప్రకృతి (లోకేషన్స్)నో లేక దర్శకుడు చేసే జిమ్మిక్కులనో గమనిస్తుంటారు. కానీ మా తెలుగు డ్రైవ్ స్పార్క్ పాఠకుడు రాధేశ్యామ్ మాత్రం ఏ సినిమాకి వెళ్లినా అందులో హీరో, హీరోయిన్, విలన్ ఇలా వివిధ నటీనటులు ఏయే కార్లను ఉపయోగించారు, ఏయే బైక్‌లను రైడ్ చేశారు అని గమనించటం హాబీ అట. అందుకే ఒక్కొక్క సినిమాను రెండేసి సార్లు మరీ చూసి వాటిని పరిశీలిస్తానంటున్నాడు శ్యామ్.
కాగా తాజాగా.. బాక్సాఫీసు రికార్డులు బద్దలుకొడుతూ అశేష ప్రేక్షకాదరణ పొందుతున్న, జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము చిత్రంలో ఎన్టీర్ ఉపయోగించిన బైక్‌లు కార్ల వివరాలను శ్యామ్ ఇలా చెప్పుకొస్తున్నాడు..!
హాయ్ నా పేరు రాధేశ్యామ్, ప్రస్తుతం అనేక సినిమాల్లో నటీనటులు ఉపయోగించే వాహనాలకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో అయితే, కార్లను బైక్‌లను వివిధ భంగిమల్లో చూపించి వాటి బ్రాండ్‌ను హైలైట్ చేసి వాటికి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఉదాహరణ బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ నటించిన బాడీగార్డ్ చిత్రంలో ఆడి బ్రాండ్ కార్లను హైలైట్ చేయగా, షారుఖ్ ఖాన్ నటించిన రావన్ చిత్రంలో ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ కార్లను, అలాగే డాన్ చిత్రంలో హ్యుందాయ్ కార్లను హైలైట్ చేశారు. మన తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన బాడీగార్డ్ చిత్రంలో కూడా ఆడి కార్లను హైలైట్ చేశారనుకోండి.
సరే ఇదంతా అటుంచి, దమ్ము చిత్రంలో వివిధ నటులు ఉపయోగించిన వాహనాల విషయానికి వస్తే.. ఇందులో హీరో ఓ టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ మోటార్‌సైకిల్‌ను (బహుశా ఆర్‌టిఆర్ 180 ఏబిఎస్ వేరియంట్ అయి ఉండొచ్చు) ఉపయోగిస్తాడు. ఈ చిత్రంలో ఈ బైక్ రెండుసార్లు కనిపిస్తుంది. అలాగే, దమ్ము టైటిల్ సాంగ్‌లో కూడా ఓ హ్యార్లీడేవిడ్‌సన్ బైక్‌ను చూపిస్తారు. ఇకపోతే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఓ నలుపు రంగు టొయోటా ఫార్చ్యూనర్ వాహనాన్ని ఉపయోగిస్తాడు.
ఇక హీరోయిన్ త్రిష విషయానికి వస్తే, ఈ చిత్రంలో ఆమె ఓ పసుపు రంగు ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ కారుతో ఎంట్రీ ఇస్తుంది. మూడు నాలుగు సార్లు ఈ కారును తెరపై చూడవచ్చు. త్రిష తండ్రి శుభలేఖ సుధాకర్ ఆడి క్యూ7 కారులో ఎంట్రీ ఇస్తాడు. సుమన్ కోసం ఓ పురాతన రోల్స్ రాయిస్ కారును ఉపయోగించగా, కోట శ్రీనివాసరావు కోసం ఓ పురాతన మెర్సిడెస్ బెంజ్ కారును ఈ సినిమాలో ఉపయోగించారు. ఇక అన్ని భారీ బడ్జెట్ తెలుగు సినిమాల్లో మాదిరిగానే దమ్ములో కూడా స్కార్పియోలు, సఫారీలు, జీపులను ఉపయోగించటం, వాటిని గాల్లోకి విసిరేయటం వంటివి చూడవచ్చు. మరి మీరు కూడా ఈ సినిమాతో పాటుగా అందులోని వాహనాలు వాటితో చేసే స్టంట్‌లను చూసి ఎంజాయ్ చేయండి.
చదివారుగా..! దమ్ము చిత్రంలో ఉపయోగించిన వాహనాల గురించి శ్యామ్ చెప్పిన వ్యాఖ్యల్ని. మరి ఇప్పటికే మీరు దమ్ము చిత్రాన్ని చూసి ఉంటే, శ్యామ్ చెప్పిన కార్/బైక్ సీన్లు మీకు గుర్తుకు వచ్చాయా..! మీరు కూడా ఇలాంటి అభిప్రాయాలను మాతో, మా తెలుగు డ్రైవ్ స్పార్క్ పాఠకులతో పంచుకోవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా మీ అభిప్రాయాలను [email protected] మెయిల్ ఐడిపై మెయిల్ చేయటమే.


Click it and Unblock the Notifications









