డ్యాట్సన్ చవక కార్లను తీసుకురానున్న నిస్సాన్ ఇండియా
మారుతి సుజుకి నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ కారు ఆల్టో అలాగే హ్యుందాయ్ నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ కారు ఇయాన్‌లను సవాల్ చేస్తూ ఇదే సెగ్మెంట్లో నిస్సాన్ ఇండియా తమ ఎంట్రీ లెవల్ కార్ బ్రాండ్ 'డ్యాట్సన్'ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. కేవలం రూ.2 లక్షల నుండి రూ.4 లక్షల ప్రైస్ రేంజ్‌లో డ్యాట్సన్ కార్లను అందించాలని నిస్సాన్ ఇండియా యోచిస్తోంది.
ప్రస్తుతం నిస్సాన్ ఇండియాకు చెన్నైకు సమీపంలో ఓరగడం వద్ద ఉన్న ప్లాంటులోనే డ్యాట్సన్ కార్లను కూడా ఉత్పత్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. ఎదుగుతున్న మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని తిరిగి మార్కెట్లోకి పునఃప్రవేశపెట్టిన డ్యాట్సన్ బ్రాండ్‌లో భారీ సంఖ్యలో కార్లను తయారు చేయాలని నిర్ణయించామని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ఎమ్‌డి, సీఈఓ టకాయుకి ఇషిదా తెలిపారు.
గత నెలలో డ్యాట్సన్ బ్రాండ్‌ను తిరిగి మార్కెట్లోకి తీసుకు వస్తామని, ఈ బ్రాండ్‌ను ఇండియా, రష్యా, ఇండోనేషియా వంటి వేగంగా అభివృద్ధి చెందుకున్న మార్కెట్లలో విడుదల చేయనున్నామని నిస్సాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 1981లో డ్యాట్సన్ బ్రాండ్‌ను నిస్సాన్ నిలిపివేసింది. వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి డ్యాట్సన్ చౌక కార్లు భారత మార్కెట్లో లభ్యం కానున్నాయి.
డ్యాట్సన్ కార్లను తొలిసారి 2012వ సంవత్సరంలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. వీటి ధర రూ.2 లక్షల నుండి రూ.4 లక్షల మధ్యలో ఉంటుందని, ఇలా అయితేనే ఇంత పోటీ ధరలో కార్లను ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుందని, ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ ట్రెండ్‌ను బట్టి గమనిస్తే, తమ హ్యాచ్‌బ్యాక్‌లో ఫిట్ అయ్యేలా ఓ చిన్న డీజిల్ ఇంజన్‌ను కూడా అభివృద్ధి చేసే అంశాన్ని కంపెనీ పరిగణిస్తోందని ఇషిదా చెప్పారు.


Click it and Unblock the Notifications









