గ్లోబల్ మార్కెట్లో టార్గెట్‌గా వస్తున్న రేవా ఎన్ఎక్స్ఆర్
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) స్వాధీనం చేసుకున్న బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ 'రేవా', మహీంద్రాలు కలిసి డిజైన్ చేసిన తొలి ఫోర్-సీటర్ ఎలక్ట్రిక్ కారు "మహీంద్రా రేవా ఎన్ఎక్స్ఆర్" త్వరలోనే మార్కెట్లో వాణిజ్య పరంగా లభ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రేవా ఎన్ఎక్స్ఆర్ కారును తొలిసారిగా ఎమ్ అండ్ ఎమ్ గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది.
గ్లోబల్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని, ప్రత్యేకించి ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉండే యూరప్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని మహీంద్రా ఈ ఎలక్ట్రిక్ కారును రూపొందించింది. ఇప్పటికే ఈ కారును వివిద దేశాల్లో మహీంద్రా రేవా టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. ఇండియాలో కూడా తమిళనాడు, బెంగుళూరు, న్యూఢిల్లీ, మహారాష్ట్ర వంటి రోడ్లపై కూడా ఎన్ఎక్స్ఆర్‌ను టెస్ట్ చేస్తోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన స్పైషాట్స్ ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.
గడచిన 2001లో రేవా విడుదల చేసిన ఎలక్ట్రిక్ కారు "రేవా ఐ" (ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు ప్రయాణించేలా రూపొందించిన కారు) తర్వాత వచ్చిన తొలి అప్‌గ్రేడెడ్ మోడల్ మహీంద్రా రేవా ఎన్ఎక్స్ఆర్. ఇది ఫస్ట్ జనరేషన్ (మొదటితరం) రేవా ఐ కన్నా ఎంతో మెరుగైనది. సాధారణ పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే మైలేజ్ విషయంలో రేవా ఎన్ఎఎక్స్ఆర్ కారు తొమ్మిది రెట్లుకు అధికంగా ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ కారులో అధిక దూరం ప్రయాణించేందుకు వీలుగా ఎక్కువ కాలం మన్నికనిచ్చే బ్యాటరీని ఉపయోగించారు. అంతేకాకుండా బ్యాటరీ పవర్ వృధాగా ఖర్చు కాకుండా ఉండేందుకు దీని గరిష్ట వేగాన్ని నియంత్రించారు. ఇది ఫుల్ ఛార్జ్‌పై 160 కి.మీ. దూరం వరకూ ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 100 కి.మీ. రేవా ఎన్ఎక్స్ఆర్ కారులో రూ.3 ఖర్చుతో 9.6 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. ఈ దీపావళి కానుకగా రేవా ఎన్ఎక్స్ఆర్‌ను మహీంద్రా రేవా విడుదల చేయొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications









