కారు కొనుగోలుకు ముందు ఆన్‌లైన్‌లో తెగ వెతికేస్తున్నారు
కాలం మారిపోయింది బాస్..! మారుతున్న టెక్నాలజీతో పాటుగానే మానవ జీవనశైలి కూడా మరిపోతూ వస్తుంది. ఇంటర్నెట్ ద్వారా ఇంట్లో కూర్చుకునే అన్ని రకాల వస్తువులు మన ఇంటి ముందుకు తెచ్చుకునే సౌకర్యం ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. బొమ్మ కార్ల నుండి నిజమైన కార్ల వరకూ ఇంటర్నెట్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసే వెసలుబాటు ఉంది.
ఆన్‌లైన్ రీసెర్చ్ కంపెనీలు అందిస్తున్న సమాచారంతో కార్లను కొనుగోలు చేసేవాళ్లు షోరూమ్‌ల చుట్టూ చక్కర్లు కొట్టడం మానేసి ఇంటి వద్ద నుండే కొత్త కార్లను బుక్ చేసుకోవటం, కొనుగోలు చేయటం ఇటీవలి కాలంలో అధికమైపోయింది. తాజా సర్వేల ప్రకారం, కారు కొనుగోలు విషయంలో ఆన్‌లైన్‌లో రీసెర్చ్ చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని తేలింది. అంతర్జాల దిగ్గజం గూగుల్ తరఫున ప్రముఖ సర్వే సంస్థ నీల్సన్ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
నీల్సన్ మొత్తం 8 నగరాల్లో 2,791 మందిపై ఈ సర్వే నిర్వహించింది. ప్రధాన పట్టణాల్లో కారును కొనుగోలు చేసే వారిలో 50 శాతం మంది ఆన్‌లైన్‌లో రీసెర్చ్ చేసిన తర్వాతనే కారును కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది. సగటు కొనుగోలుదారుడు తన కారు కొనుగోలు విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు కనీసం 9 నుంచి 12 వారాల పాటు ఆన్‌లైన్‌లో శోధన చేస్తున్నాడని నీల్సన్ తెలిపింది.
ఇలా ఆన్‌లైన్ రీసెర్చ్ చేసిన కారు కొనుగోలుదారులు నిజానికి తాము కొనుగోలు చేయాలనుకున్న కారు కాకుండా, ఆన్‌లైన్‌లో లభించే సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తమ ఇష్టాన్ని మార్చుకుని వేరకొ కార్ బ్రాండ్‌ను కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది కాలంగా గమనిస్తే.. ఎస్‌యూవీ (స్పోర్ట్స్‌యుటిలిటి వెహికల్స్)ల గురించిన ప్రశ్నలు పెరిగాయి. వీటి తర్వాతి స్థానాల్లో ప్రీమియం కార్లు, సెడాన్లు, లగ్జరీ కార్లకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయని నీల్సన్ సర్వే పేర్కొంది.
ఇలాంటి సమాచారం విషయంలో ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్(ఓఈఎమ్) వెబ్‌సైట్లు ముఖ్యమైనవని, నమ్మకమైనవని చాలా మంది కారు కొనుగోలుదారులు భావిస్తున్నారని, కార్ రీసెర్చ్‌కు, ధరలను పోల్చడానికి, వీడియోలు, ఫొటోలను వీక్షించడానికి, విశ్లేషణలకు, డీలర్ల వివరాలను తెలుసుకోవడానికి, నిపుణుల, వినియోగదారుల సమీక్షలను చదవడానికి ఇలాంటి సెర్చ్ టూల్స్‌ను ఉపయోగిస్తున్నారని నీల్సన్ తెలిపింది.
ఇండియాలో హ్యుందాయ్ ఇయాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ500, హోండా బ్రయో, టాటా మాంజా, మారుతి కిజాషి, హ్యుందాయ్ వెర్నా, ఫోర్డ్ ఫియస్టా వంటి కార్ల గురించి వినియోగదారులు అధికంగా సెర్చ్ చేశారని నీల్సన్ సర్వే వెల్లడిస్తుంది. కాగా.. మా పాఠకుల కోసం సైతం డ్రైవ్ స్పార్క్ ఈ తరహా కార్ రీసెర్చ్ టూల్‌ను అందిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ను సందర్శించవచ్చు. https://www.drivespark.com/cars/


Click it and Unblock the Notifications








