మహీంద్రా అండ్ మహీంద్రా సిఎమ్‌డిగా ఆనంద్ మహీంద్రా
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎమ్‌డి)గా ఆనంద్ మహీంద్రా ఎన్నికయ్యారు. ఈ మేరకు బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో కంపెనీ బోర్డను ఆనంద్ మహీంద్రాను సిఎమ్‌డిగా అంగీకరిస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ సిఎమ్‌డి స్థానంలో కొనసాగిన కెషుబ్ మహీంద్రా పదవీవిరమణ పొందడంతో ఆనంద్ మహీంద్రాకు ఈ అవకాశం దక్కింది.
కెషుబ్ మహీంద్రా 1948లో మహీంద్రా బోర్డులో సభ్యులుగా చేరారు. అనంతరం 1963లో ఆయన ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన జరిగే సంస్థ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో ఆనంద్ మహీంద్రా సిఎండిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆనంద్ మహీంద్రా ప్రస్తుతం మహీంద్రా గ్రూప్‌కు వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్, ఒక్క ఆటోమొబైల్ రంగంలోనే కాకుండా ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, ఐటి, రియల్ ఎస్టేట్, ఆర్థిక సేవలు, ఆసుపత్రులు తదితర రంగాల్లో విస్తరించింది. అలాగే, బ్రిటిష్ టెలికం, మిత్సుబిషి వంటి విదేశీ పారిశ్రామిక సంస్థల్లో సైతం మహాంద్రా గ్రూప్ వ్యాపార భాగస్వామిగా ఉంది.


Click it and Unblock the Notifications









