'మారుతి జిప్సి'ని కుందేలుతో పోల్చిన ఆనంద్ మహీంద్రా
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) చిరుత పులి నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన గ్లోబల్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ500 గురించి బడాయిపోతుంది. ఈ ఎస్‌యూవీ గురించి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో ఓ తమాషా ట్వీట్ చేశారు. మహీంద్రా తన ట్వీట్‌లో మారుతి సుజుకి అందిస్తున్న జిప్సి ఎస్‌యూవీని కుందేలుతో పోల్చారు.
అసలు విషయం ఏంటంటే, ఎమ్ అండ్ ఎమ్ నిర్వహిస్తున్న మహీంద్రా గ్రేట్ ఎస్కేప్ ఆఫ్-రోడ్ అడ్వెంచర్ ర్యాలీలో ఓ వ్యక్తి తన మారుతి సుజుకి జిప్సితో పాల్గొనవచ్చా అని ట్విట్టర్‌లో ఆనంద్ మహీంద్రాను అడిగాడు. దానికి మహీంద్రా సమాధానమిస్తూ, 'చిరుత పులులు తిరిగే చోట కుందేలు తిరగటం సురక్షితమేనా' (Is it safe to let rabbits roam where cheetahs prowl) అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
మహీంద్రా యజమానులు కోసం, ఆసక్తి కలిగిన ర్యాలీ డ్రైవర్ల కోసం మహీంద్రా అండ్ మహీంద్రా గత కొద్ది కాలంగా దేశవ్యాప్తంగా వివిధ ఆఫ్-రోడింగ్ అడ్వెంచర్ ట్రిప్‌లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే 'మహీంద్రా గ్రేట్ ఎస్కేప్' పేరుతో నిర్వహిస్తోన్న ఈ ర్యాలీలో ఎక్కువగా స్కార్పియో, థార్ ఎస్‌యూవీలు కనిపిస్తాయి. ఎక్స్‌యూవీ500 చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆఫ్-రోడింగ్‌లో తమ వాహనాలు ఎంతటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయో తెలిపేందుకే కంపెనీ ఈ తరహా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఆనంద్ మహీంద్రా ట్వీట్స్ ఎప్పుడూ కూడా చాలా సీరియస్‌గా ఉంటాయి. అయితే, ఈసారి కొంచెం సరదాగా మారుతి సుజుకి జిప్సి పట్ల ఆయన ట్వీట్‌ని చూసిని ఫాలోవర్స్ షాక్‌కు గురయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ, సరదాగా ట్వీట్ చేశానని స్పష్టం చేశారు. మహీంద్రా ఎక్స్‌యూవీ500 దేశీయ మార్కెట్ నుంచే కాకుండా గ్లోబల్ మార్కెట్ నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది.
మారుతి సుజుకి జిప్సి విషయానికి వస్తే.. దేశపు పురాతన కంపెనీ అందిస్తున్న తొలి ఆఫ్-రోడర్ వెహికల్ ఇది. ఒకప్పట్లో అత్యంత ప్రజాదరణను సొంతం చేసుకున్న మారుతి సుజుకి జిప్సి, ప్రస్తుతం మార్కెట్లో పెరిగిన పోటీ, అనేక మోడళ్లు అందుబాటులో ఉండటం వంటి కారణాల వల్ల ఇది చరిత్రలో కలిసిపోయింది. 1985లో ఇది భారత మార్కెట్లోకి ప్రవేశించింది.
మారుతి సుజుకి జిప్సిలో 1.3 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. నిజం చెప్పాలంటే, ఇప్పుడు మార్కెట్లో ఉన్న పవర్‌ఫుల్ ఎస్‌యూవీలు, ఆఫ్-రోడ్ వాహనాలతో పోల్చుకుంటే దీని సత్తా తక్కువే అనొచ్చు. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామెతను మాత్రం మర్చిపోకూడదు. ఏమంటారు..?


Click it and Unblock the Notifications









