బిఎమ్‌డబ్ల్యూని ఓవర్‌టేక్ చేయనున్న ఆడి ఇండియా
మొత్తానికి అనుకున్నదే జరిగేటట్లుంది. భారత లగ్జరీ కార్ మార్కెట్లో అగ్ర స్థానాన్ని ఆడి ఇండియా ఎగరేసుకుపోయే సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ సెగ్మెంట్లో గడచిన కొన్నేళ్లుగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న మెర్సిడెస్ బెంజ్‌ను వెనక్కు నెట్టి ఆ స్థానాన్ని బిఎమ్‌డబ్ల్యూ ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, వేగంగా వృద్ధి చెందుతున్న ఆడి బ్రాండ్ కారణంగా బిఎమ్‌డబ్ల్యూ తన అగ్రస్థానాన్ని కోల్పేయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) విడుదల చేసిన తాజ గణాంకాల ప్రకారం, మొదటి ఈ ఏడాది త్రైమాసికంలో ఆడి ఇండియా అమ్మకాలు ఏకంగా 52.15 శాతం వృద్ధిని సాధించి 1,908 యూనిట్లను విక్రయాలను తన ఖాతాలో వేసుకుంది. గడచిన సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ మొత్తం 1,254 యూనిట్ల వాహనాలను విక్రయించింది.
కాగా.. ఇదే కాలానికి ప్రస్తుతం భారత లగ్జరీ కార్ మార్కెట్ లీడర్‌గా ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అమ్మకాల్లో 12.16 శాతం క్షీణతను నమోదు చేసి 2,088 యూనిట్లు మాత్రమే విక్రయించింది. క్రితం సంవత్సరం ఇదే సమయంలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా 2,377 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ సెగ్మెంట్లో ప్రస్తుతం ద్వితీయ స్థానంలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో 24.41 శాతం క్షీణించి 1,257 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇవి 1,663 యూనిట్లుగా ఉన్నాయి.
అయితే కేవలం జూన్ 2012 నెల అమ్మకాలను మాత్రమే గమనిస్తే.. ఈ సమయంలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా మొత్తం 759 వాహనాలను విక్రయించగా, ఆడి ఇండియా 750 వాహనాలను విక్రయించింది. కాగా.. జూన్ 2011లో ఆడి ఇండియా అమ్మకాలు కేవలం 354 యూనిట్లుగా మాత్రమే ఉంటే, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అమ్మకాలు 890 యూనిట్లుగా ఉన్నాయి. జూన్ 2011లో మెర్సిడెజ్ బెంజ్ ఇండియా అమ్మకాలు 556 యూనిట్లుగా ఉండగా, జూన్ 2012లో ఇవి 622 యూనిట్లుగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో జర్మనీకు చెందిన బిఎమ్‌డబ్ల్యూ ఇటీవలే ఇండియన్ ఆపరేషన్స్ హెడ్ ఆండ్రియాస్ స్కాఫ్‌ను వెనక్కు పిలిపించింది. ఆయన స్థానంలో వేరొక అధికారిని కంపెనీ నియమించటం జరిగింది. మొత్తమ్మీద చూస్తే.. లగ్జరీ కార్ మార్కెట్లో గట్టి పోటీ వాతావరణం కనిపిస్తోంది. ఈ పోటీ కారణంగా రానున్న రోజుల్లో అతి తక్కువ ధరకే విలాసవంతమైన కార్లు లభించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.


Click it and Unblock the Notifications









