చీప్ కార్ నానో ఇకపై చీప్ కారు కాదు: రతన్ టాటా
గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ఛైర్మన్ రతన్ టాటా, నానో కారు గురించి ప్రస్థావిస్తూ, టాటా నానో పేదవాడి కారుగా ముద్రపడటంతో మార్కెట్లో మంచి ఆదరణను దక్కించుకోలేకపోయిందని అన్నారు. దీంతో, తాజాగా నానోలో మరింత శక్తివంతమైన ఇంజన్‌ను ప్రవేశపెట్టి మారుతి సుజుకి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్ కార్లకు ధీటుగా విడుదల చేయాలని భావిస్తున్నామని రతన్ టాటా చెప్పటం జరిగింది.
ప్రస్తుతం కంపెనీ మార్కెట్లో అందిస్తున్న 2012 వెర్షన్ టాటా నానో కూడా కొనుగోలుదారులను బాగానే ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి నెలలో టాటా నానోపై కంపెనీ అందించిన ఎక్సేంజ్ బోనస్ ఆఫర్, క్యాష్ డిస్కౌంట్ స్కీమ్‌లు బాగానే పనిచేశాయి. అందుకే ఆ నెలలో టాటా మోటార్స్ మొత్తం 9,217 నానో కార్లను విక్రయించగలిగింది. ఫిబ్రవరి 2011లో టాటా నానో అమ్మకాల సంఖ్య 7,723 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి.
త్వరలోనే ప్రతి నెలా 10,000 యూనిట్లకు పైగా నానో కార్లను విక్రయించగలమని కంపెనీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నా టాటా నానో ఆన్-రోడ్ సుమారు రూ.1.80 లక్షల నుండి రూ.2.50 లక్షల వరకూ ఉంటోంది. కాగా.. టాటా మోటార్స్ కొత్తగా మార్కెట్లోకి విడుదల చేయదలచిన టాటా నానో కారు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర సుమారు రూ.2.4 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications









