బడ్జెట్ భారంతో కార్ల ధరలను భారీగా పెంచిన ఆడి
ఇకపై ఆడి కార్లు మరింత ప్రియం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2012-13లో పెద్ద కార్లపై ఎక్సైజ్ సుంఖాలను 22 శాతం నుండి 27 శాతానికి, దిగుమతి చేసుకున్న కార్లపై దిగుమతి సుంఖాన్ని 60 శాతం నుండి 75 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
భారత మార్కెట్లో తాము అందిస్తున్న అన్ని మోడళ్ల ధరలను పెంచనున్నామని ఆడి ఇండియా తెలిపింది. సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారైన కార్లను దిగుమతి చేసుకుని ఇండియన్ మార్కెట్లో విక్రయించే మోడళ్ల ధరలను 13 శాతం నుండి 14 శాతం మేర పెంచనున్నామని, స్థానికంగా తయారయ్యే (ఇడియాలో అసెంబ్లింగ్ చేసే) మోడళ్ల ధరలను 3.4 శాతం నుండి 3.7 శాతం మేర పెంచనున్నామని కంపెనీ తెలిపింది.
భారత మార్కెట్లో ఆడి ఏ7 స్పోర్ట్స్‌బ్యాక్, ఆడి ఏ8 ఎల్, ఆడి ఆర్ఎస్5 మోడళ్లను కంపెనీ సిబియూ రూట్లో విక్రయిస్తుంది. వీటి ధరలు రూ.66 లక్షల నుండి రూ.86 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకూ ఉన్నాయి. కాగా.. ఇదే కారణంతో హోండా సియోల్ కార్స్ ఇండియా కూడా రూ.4,000 నుండి రూ.95,000 వరకూ ఉత్పత్తుల ధరలను పెంచిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications









