మారుతి సుజుకిని ముందుకు నడిపిన ఎర్టిగా ఎమ్‌పివి
దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) అందిస్తున్న ఫస్ట్ అండ్ లేటెస్ట్ మల్టీ పర్పస్ యుటిలిటీ వెహికల్ (ఎమ్‌పివి) ఎర్టిగా దేశీయ విపణిలో హాట్ కేకుల్లా అమ్ముడైపోతుంది. ఫలితంగా ఇది కంపెనీ అమ్మకాలు పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గడచిన సెప్టెంబర్ నెలలో మారుతి సుజుకి అమ్మకాలు 9.8 శాతం పెరిగాయి. ఈ సమయంలో కంపెనీ మొత్తం 93,988 వాహనాలను విక్రయిచింది. గతేడాది ఇదే సమయంలో 85,565 వాహనాలను విక్రయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా.. గడచిన సెప్టెంబర్ నెలలో చిన్న కార్ సెగ్మెంట్లో కంపెనీ అమ్మకాలు 4.9 శాతం వృద్ధి చెంది 39,150 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ నెలలో మారుతి సుజుకి తమ కొత్త ఆల్టో 800 కారును మార్కెట్లో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సెగ్మెంట్లో అమ్మకాలు మరింత పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో కంపెనీ అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ స్విఫ్ట్ డిజైర్ అమ్మకాలు గరిష్టంగా 24.3 శాతం వృద్ధిని సాధించి 11,694 యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ తెలిపింది.
కొత్త మారుతి సుజుకి ఎర్టిగా రాకతో కంపెనీ యుటిలీటీ వాహన సెగ్మెంట్లో అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. ఈ సెగ్మెంట్లో గడచిన సెప్టెంబర్ 2011 నెలలో 412 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 7,224 యూనిట్లుగా నమోదయ్యాయి. మారుతి సుజుకి ఓమ్నీ, ఈకో వ్యాన్‌ల అమ్మకాలు 9.7 శాతం పెరిగి 12,650 యూనిట్లుగా నమోదయ్యాయి.
అయితే, గడచిన జులై, ఆగస్ట్ నెలల్లో మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్‌లో జరిగిన అల్లర్ల కారణంగా ఉత్పత్తి నిలిచిపోవడంతో స్విఫ్ట్, రిట్జ్, ఎస్టిలో వంటి కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. వీటి అమ్మకాలు 9.7 శాతం పడిపోయి 17,813 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ అందిస్తున్న ప్రీమియం సెడాన్ మారుతి సుజుకి కిజాషిపై భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఈ మోడల్ అమ్మకాలు ఫర్వాలేదనిపించాయి. గడచిన ఆగస్టు నెలలో ఒక్క కిజాషి కారు కూడా అమ్ముడుపోలేదు.
కానీ సెప్టెంబర్ నెలలో డిస్కౌంట్‌ను ఆఫర్ చేసిన కారణంగా ఈ నెలలో మొత్తం 12 కార్లు అమ్ముడు పోయాయి. ఇకపోతే కంపెనీ ఎగుమతులు మాత్రం 23.1 శాతం క్షీణించి 5,187 యూనిట్లకు పరిమితం అయ్యాయి. మారుతి సుజుకి అందిస్తున్న ఏ-స్టార్ హ్యాచ్‌బ్యాక్ (గ్లోబల్ మార్కెట్లలో ఆల్టో పేరుతో అమ్ముడవుతోంది) కంపెనీ నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతున్న కారు.


Click it and Unblock the Notifications









