కార్ల ధరలను పెంచిన జనరల్ మోటార్స్
ఇప్పటికే, మారుతి సుజుకి ఇండియా మరో వారంలో తమ ఉత్పత్తుల ధరలు పెంచనున్నామని ప్రకటించగా, ఆడి ఇండియా వచ్చే నెల నుంచి తమ లగ్జరీ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆడి క్యూ3 ధరను పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా జనరల్ మోటార్స్ ఇండియా కూడా కార్ల ధరలను పెంచనున్న కంపెనీల జాబితాలో చేరిపోయింది.
అక్టోబర్ 1, 2012 నుంచి తమ ఉత్పత్తుల ధరలను 1 శాతం మేర పెంచనున్నామని ఈ అమెరికన్ కార్ కంపెనీ పేర్కొంది. ఈ తాజా పెంపుతో జనరల్ మోటార్స్ ఇండియా దేశీయ విపణిలో చెవర్లే బ్రాండ్‌లో అందిస్తున్న కార్ల ధరలు ఇకపై మరింత ప్రియం కానున్నాయి. విదేశీ కరెన్సీతో పోల్చుకుంటే రూపాయి మారకపు విలువ బలహీనంగా ఉండటం, ఫలితంగా ఉత్పాదక వ్యయాలు పెరగటమే ధరల పెంపుకు కారణమని కంపెనీ వివరించింది.
జనరల్ మోటార్స్ ఈ ఏడాది ఆరంభంలో తొలిసారి కార్ల ధరలను పెంచింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఎక్సైజ్ సుంఖాల నెపంతో మరోసారి ధరలను పెంచటం జరిగింది. కాగా.. తాజా మూడోసారి వచ్చే నెల కార్ల ధరలను కంపెనీ పెంచనుంది. ఏయే మోడళ్లపై ఎంత మేర ధరలను పెంచనున్నామనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి బాలేంద్రన్ తెలిపారు.


Click it and Unblock the Notifications









