జనరల్ మోటార్స్ నుంచి మూడు కొత్త కార్లు
ఇండియన్ మార్కెట్లో కొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేస్తూ సరికొత్త జోరుమీదున్న అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ ఈ ఏడాది చివరి నాటికి మరో మూడు కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురానుంది. జనరల్ మోటార్స్ తాజాగా అప్‌గ్రేడెడ్ చెవర్లే క్రూజ్, చెవర్లే కాప్టివాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే, భారత కార్ మార్కెట్లో తన వాటాను మరింత పెంచుకునేందుకు, ఇక్కడి మార్కెట్లో తమ ఉత్పత్తుల శ్రేణిని మరింత విస్తరించుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగానే, ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం డిజైన్ చేసిన చిన్న కారు చెవర్లే సెయిల్, ఫేస్‌లిఫ్టెడ్ చెవర్లే స్పార్క్ హ్యాచ్‌బ్యాక్, చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి కార్లను జనరల్ మోటార్స్ ఈ ఏడాది చివరి నాటికి దేశీయ విపణిలో ప్రవేశపెట్టనుంది.
చెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్, సెడాన్:
ప్రస్తుతం జనరల్ మోటార్స్ నుంచి అంతంతమాత్రంగా అమ్ముడుపోతున్న చెవర్లే యూవీ-ఏ హ్యాచ్‌బ్యాక్, సెడాన్ మోడళ్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపి వేసి వీటి స్థానంలో చెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లను ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం చెవర్లే సెయిల్‌కు చైనా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
చెవర్లే స్పార్క్ హ్యాచ్‌బ్యాక్:
ఒకప్పుడు చెవర్లే స్పార్క్ కారుకు మార్కెట్లో ఉన్న క్రేజ్ ఇప్పట్లో లేదనే చెప్పవచ్చు. ఇది చూడటానికి చిన్న కారైనప్పటికీ స్పేస్, కంఫర్ట్ విషయాల్లో ఈ సెగ్మెంట్లో ది బెస్ట్ కార్‌గా ఉంటుంది. అయితే, మైలేజ్ విషయంలో ప్రస్తుతం చిన్న కార్ రేస్ పోటీలో వెనుకబడిన చెవర్లే స్పార్క్‌లో ఓ మెరుగైన వేరియంట్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ చిన్న కార్ సెగ్మెంట్లో పోటీ అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ సెగ్మెంట్లో అమ్మకాలు కోల్పోవటం ఇష్టం లేని జనరల్ మోటార్స్ అన్ని విధాలుగా మెరుగ్గా ఉండే ఓ సరికొత్త చెవర్లే స్పార్క్‌ను ఏడాది దీపావళి నాటికి మార్కెట్లోకి తీసుకురానుంది.
చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి:
ఇకపోతే చివరిగా.. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఎమ్‌పివి (మల్టీ పర్పస్ వెహికల్) సెగ్మెంట్లో కూడా తమ సత్తా చూపించేందుకు జనరల్ మోటార్స్ సిద్ధమవుతోంది. గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో జనరల్ మోటార్స్ ఆవిష్కరించిన చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి కూడా ఈ ఏడాదే మార్కెట్లో విడుదల కానుంది. టొయోటా ఇన్నోవా, మారుతి సుజుకి ఎర్టిగా మోడళ్లకు ధీటుగా చెవర్లే ఎంజాయ్ నిలువనుంది.
కాగా.. జనరల్ మోటార్స్ ఇటీవలే రూ.18.74 లక్షల నుంచి రూ.24.59 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర రేంజ్‌లో అప్‌గ్రేడెడ్ చెవర్లే కాప్టివా ప్రీమియం ఎస్‌యూవీని, రూ.13.85 లక్షల నుంచి రూ.15.67 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర రేంజ్‌లో రిఫ్రెష్డ్ డీజిల్ వేరియంట్ చెవర్లే క్రూజ్ ప్రీమియం సెడాన్‌ను విడుదల చేసింది.


Click it and Unblock the Notifications








