4.75 లక్షలకు పైగా చెవర్లే క్రూజ్‌లను రీకాల్ చేయనున్న జిఎమ్
అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ (జిఎమ్) అందిస్తున్న ప్రీమియం సెడాన్ 'చెవర్లే క్రూజ్'లో ఇంజన్ సమస్యలు తలెత్తున్న కారణంగా సుమారు 4,75,000 లకు పైగా చెవర్లే క్రూజ్ సెడాన్లను జిఎమ్ వెనక్కు (రీకాల్) పిలిపించనుంది. యునైటెడ్ స్టేట్స్, కెనెడా మరియు ఇజ్రాయేల్ దేశాలలో విక్రయించిన చెవర్లే క్రూజ్ సెడాన్ ఇంజన్‌లో సమస్యల కారణంగా ఈ కార్లలో మంటలు తలెత్తే ప్రమాదం ఉండటంతో వీటిని రీకాల్ చేయనున్నామని జనరల్ మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తమ వినియోగదారులు కొనుగోలుచేసిన చెవర్లే క్రూజ్ సెడాన్ మరింత సురక్షితమైనదిగానూ, ధృడమైనదిగానూ ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ రీకాల్ చేస్తున్నామని, కస్టమర్లకు అసౌకర్యం కలిగించినందుకు తాము క్షమాపణలు తెలియజేస్తున్నామని జనరల్ మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ క్వాలిటీ) అలీసియా బోలెర్-డేవిస్ వెల్లడించారు. ఈ కార్లలో ఫ్యూయెల్ ట్యాంక్‌ను, రియర్ ఫ్లోర్‌ను ప్రభావితం చేసే వెల్డింగ్ సమస్యను కూడా జనరల్ మోటార్స్ తనిఖీ చేయనుంది.
రెండు చెవర్లే క్రూజ్ కార్లలోని ఇంజన్ కంపార్ట్‌మెంట్‌లలో అగ్నిప్రమాదం సంభవించిన కేసుల్లో గడచిన ఏప్రిల్ నెలలో అమెరికా భద్రతా నియంత్రణ సంస్థ చేపట్టిన ఇన్‌వెస్టిగేషన్ తర్వాత ఈ రీకాల్ చేయటం జరిగింది. ఈ రీకాల్‌లో భాగంగా, తమ వద్దకు వచ్చే క్రూజ్ కార్లలో ఇంజన్ సమస్యలను, వెల్డింగ్ సమస్యలు తనిఖీ చేసి లోపాలేవైనా ఉంటే ఉచితంగా సరిచేస్తామని, ఈ రీకాల్ గురించి తమ వినియోగదారులకు ప్రత్యేకంగా తెలియజేస్తామని కంపెనీ పేర్కొంది.
జనరల్ మోటార్స్‌లోని లార్డ్స్‌టౌన్, ఓహియో ప్లాంట్‌లలో సెప్టెంబర్ 2012 నుంచి మే 2012 మధ్య కాలంలో తయారైన వాహనాలకు మాత్రమే ఈ రీకాల్ వర్తిస్తుంది. ఈ రీపేర్లను చేయడానికి కేవలం 30 నిమిషాల సమయం సరిపోతుందని కంపెనీ పేర్కొంది. యునైటెడ్ స్టేట్స్, కెనెడా, ఇజ్రాయేల్ దేశాలలో విక్రయించిన చెవర్లే క్రూజ్ కార్లు మాత్రమే ఈ రీకాల్‌కు వర్తిస్తాయని జనరల్ మోటార్స్ పేర్కొంది. అయితే, ఇండియాలో విక్రయించిన చెవర్లే క్రూజ్ మోడళ్ల గురించి జనరల్ మోటార్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. బహుశా ఇక్కడి మార్కెట్లో విక్రయించినవి పూర్తిగా సురక్షితమైన కాబోలు..!


Click it and Unblock the Notifications









