డీజిల్ కార్లపై భారీ పన్ను వసూళ్లకు సిద్ధమవుతున్న సర్కారు
వినియోగదారులారా సిద్ధం కండి..!! కారు భారాన్ని మీపై మోపేందుకు ప్రభుత్వం అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. డీజిల్ ధరలపై ఏకంగా రూ.2.55 లక్షల రూపాయలను పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర చమురు శాఖా మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ఓ లేఖ రాశారు. ఇందులో డీజిల్‌తో నడిచే కార్లపై భారీగా వడ్డనలు చేయాలని ప్రతిపాదనలు చేశారు.
జైపాల్ రెడ్డి ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో చిన్న డీజిల్ కార్లపై (హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ కార్లు) రూ.1.70 లక్షలు, మధ్య తరహా, పెద్ద డీజిల్ కార్లపై (సెడాన్లు, ఎస్‌యూవీలు, ఎమ్‌పివిలు మొదలైనవి) రూ.2.55 లక్షల వరకూ ఎక్సైజ్ సుంఖాలను విధించాలని ప్రతిపాదన చేశారు. డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసం కారణంగా డీజిల్ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగిపోయి, ఫలితంగా డీజిల్ ఇంధన వినియోగం కూడా అధికమవుతోంది. ఇదే విషయాన్ని జైపాల్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు.
గత 2010-11లో 6.2 శాతంగా ఉన్న డీజిల్ వినియోగం 2011-12లో 7.2 శాతానికి పెరిగిందని, ఇదే సమయంలో పెట్రోల్ వినియోగం భారీగా తగ్గిందని ఆయన తన లేఖలో వివరించారు. 2010-11లో 10.7 శాతంగా ఉన్న పెట్రోల్ వినియోగం 2011-12లో 5.6 శాతానికి తగ్గింది.
ఒక లీటరు పెట్రోల్ ధరకు, ఒక లీటరు డీజిల్ ధరకు మధ్య వ్యత్యాసం సుమారు రూ.30 ఉండటం, మరియు పెట్రోల్‌తో నడిచే కార్లతో పోల్చుకుంటే డీజిల్‌తో నడిచే కార్లు అధిక మైలేజీనిస్తున్న కారణంగా వీటి ధరలు అధికంగా ఉన్నప్పటికీ కొనుగోలుదారులు డీజిల్ కార్లవైపే మొగ్గు చూపుతున్నారు.
డీజిల్ కార్లు ఇచ్చే మైలేజ్‌ను పరిగణలోకి తీసుకొని (చిన్న కార్లు ఎక్కువ మైలేజీని, పెద్ద కార్లు తక్కువ మైలేజీనిస్తాయి) చిన్న కార్లకు రూ.1.70 లక్షలు, పెద్ద కార్లకు రూ.2.55 లక్షల చొప్పున అధనపు ఎక్సైజ్ సుంకాలను విధించాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంది. దీనికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ప్రకటిస్తే.. సామాన్యుడి కారు కల కలగానే మిగిలిపోవటం ఖాయం. మీరేమంటారు..?


Click it and Unblock the Notifications









