ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కోసం రూ.23,000 కోట్లు
పర్యావరణానికి హాని కలిగించని, విద్యుత్ ద్వారా పనిచేసే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని మహీంద్రా గ్రూప్ సంస్థల సారధి ఆనంద్ మహీంద్రా ఇటీవల బెంగుళూరులో తమ మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంటును ప్రారంభించిన సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
కాగా.. ఇప్పుడు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చింది. రానున్న 8 ఏళ్లలో మార్కెట్లో వచ్చే విద్యుత్ ఆధారిత వాహనాలకు సాధ్యమైనంత ఎక్కువ సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాలని సెంటర్ ప్రాజెక్ట్స్ నివేదిక చేసిన సిఫార్సులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ఈ మేరకు 4.1 బిలియన్ డాలర్లు (సుమారు 23 వేల కోట్ల రూపాయలు) మంజూరు చేసినట్టు భారీ పరిశ్రమల శాఖ కార్యదర్వి ఎస్ సుందరేశన్ బుధవారం నాడు వెల్లడించారు.
గడచిన 2011 బడ్జెట్‌లో మాజీ ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించిన నేషనల్ ఎలక్ట్రిక్ వెహికల్ మిషన్ పాలసీకు పొడగింపుగా ఈ స్కీమ్‌లను అందించనున్నారు. భారత్‌లో 2020 నాటికి 60 లక్షల ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు అమ్మడుపోగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీటిలో కనీసం 50 శాతం బీఈవీ (బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్)లు ఉంటాయని సెంటర్ ప్రాజెక్ట్స్ నివేదిక అంచనా వేసింది.
ఈ అమ్మకాల సంఖ్యను సాధించాలంటే, మరింత సమర్థవంతమైన పనితీరు కలిగిన బ్యాటరీల లభ్యత ఎంతో అవసరం. ప్రస్తుతం, ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే మన్నిక కలిగిన బ్యాటరీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటం జరుగుతుంది. అధిక దిగుమతి సుంఖాల కారణంగా వీటి ఉత్పాదక వ్యయం కూడా పెరిగి, బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ కార్లు సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు.
ఇందుకు అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సబ్సిడీలు, కార్ల రుణాల కోసం 20 నుంచి 23 వేల కోట్ల రూపాయలను పెట్టబడిగా పెట్టాల్సి వస్తుందని బుధవారం నాడు సమావేశమైన నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 2020 సమావేశంలో ప్రభుత్వం తమ నివేదికను వుంచింది. ఈ సమావేశానికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ అధ్యక్షత వహించారు.
మరో ఎనిమిదేళ్లలో సుమారు 70 లక్షల వరకూ బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాలు, కార్లు అమ్ముడుపోతాయని, దీని వలన 2.2 నుంచి 2.25 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ వినియోగాన్ని తగ్గించవచ్చని ఈ కమిటీ వివరించింది. ప్రస్తుతం దేశంలో వినియోగంలో వున్న చమురు ఉత్పత్తుల్లో మూడింట రెండు వంతులు రవాణా రంగానికే ఖర్చవుతున్న సంగతి తెలిసిందే. ఇంధన వినియోగాన్ని తగ్గించి తద్వారా పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే, బ్యాటరీ ఆధారిత వాహనాలను ప్రోత్సహించాల్సి ఆవశ్యకత ఎంతైనా ఉంది.


Click it and Unblock the Notifications









