దక్షిణాఫ్రికాకు ప్రయాణం కట్టిన హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ విపణిలో అందిస్తున్న బుజ్జి కారు హోండా బ్రయో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లకు పయనం అయింది. ఈ మేడ్ ఇన్ ఇండియా కారును కంపెనీ విదేశాలకు ఎగుమతి చేయడాన్ని ప్రారంభించింది. హోండాకు గ్రేటర్ నోయిడాలో ఉన్న ప్లాంటులో హోండా బ్రయో ఉత్పత్తి జరుగుతోంది. ఆ ప్లాంటు నుంచే ఈ కారును దక్షిణాఫ్రికా మార్కెట్లకు ఎగుమతి చేయడాన్ని ప్రారంభించామని కంపెనీ పేర్కొంది. ఈ మార్కెట్‌కు విడతల వారీగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1,600 యూనిట్లను ఎగుమతి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
తొలి విడతలో భాగంగా, 390 బ్రయో కార్లను హోండా దక్షిణాఫ్రికా ఎగుమతి చేసింది. దక్షిణాఫ్రికా తర్వాత టాంజానియా, కెన్యా, మారిషస్, సియాచెల్స్ దేశాలకు కూడా ఈ చిన్న కారును ఎగుమతి చేయాలనుకుంటున్నట్లు హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. ఎక్స్‌పోర్ట్ వెర్షన్ హోండా బ్రయోను కూడా గ్రేటర్ నోయిడాలోని ప్లాంటులో తయారు చేస్తున్నారు. ఈ ప్లాంటులో నెలకు 2,500 యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. హోండా బ్రయో ఇంజన్, ట్రాన్సిమిషన్‌లను మాత్రం రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంటులో తయారు చేస్తున్నారు.

హోండా బ్రయోను త్వరలోనే సార్క్ దేశాలకు కూడా ఎగుమతి చేయాలని కంపెనీ యోచిస్తోంది. డిసెంబర్ నెల మొదటి వారం నుంచి దక్షిణాలో హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు సాగనున్నాయి. హోండా బ్రయోలో ఉపయోగించిన 4-సిలిండర్, 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 88 పిఎస్‌ల శక్తిని, 4500 ఆర్‌పిఎమ్ వద్ద 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వెర్షన్ బ్రయో లీటర్ పెట్రోల్‌కు 18.4 కి.మీ. మైలేజీని, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వెర్షన్ బ్రయో లీటరుకు 16.5 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
హోండా బ్రయో వేరియంట్లు, ధరలు:
- హోండా బ్రయో ఈ ఎమ్‌టి - రూ. 4.06 లక్షలు
- హోండా బ్రయో ఈఎక్స్ ఎమ్‌టి - రూ. 4.26 లక్షలు
- హోండా బ్రయో ఎస్ ఎమ్‌టి - రూ. 4.55 లక్షలు
- హోండా బ్రయో ఎస్(ఓ) ఎమ్‌టి - రూ. 4.99 లక్షలు
- హోండా బ్రయో ఎస్(ఓ) ఏటి - రూ. 5.74 లక్షలు
- హోండా బ్రయో వి ఎమ్‌టి - రూ. 5.24 లక్షలు
- హోండా బ్రయో వి ఏటి - రూ. 5.99 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








