హోండా కొత్త సిటీ మంత్రం బాగానే పనిచేసింది
గడచిన సంవత్సరం డిసెంబర్ 14, 2012న హోండా ఫేస్‌లిఫ్ట్ 2012 వెర్షన్ సిటీ సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కేవలం రూ.6.99 లక్షల ప్రారంభ ధరకే (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కొత్త సిటీను హోండా ప్రవేశపెట్టింది. దీనికి తోడు థాయ్‌లాండ్ వరదల కారణంగా ఏర్పడిన విడిభాగాల కొరత కూడా సమసిపోవడంతో, గత నెల నుండి సిటీ సెడాన్ ఉత్పత్తి జోరందుకుంది. ఫిబ్రవరిలో 6,052 హోండా సిటీ కార్లు అమ్ముడయ్యాయి.
ఇదే సెగ్మెంట్లో ఇప్పటి వరకూ హవా కొనసాగిస్తూ వచ్చిన ఫోక్స్‌వ్యాగన్ వెంటో, హ్యుందాయ్ ఫ్లూయిడిక్ వెర్నాలకు కొత్త సిటీ బాగానే చెక్ పెట్టింది. కీలక మార్పులు చేసి మార్కెట్లోకి విడుదల చేసిన కొత్త సిటీకు మార్కెట్ నుండి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో అమ్మకాల పరంగా హోండా సిటీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
ఇప్పటి వరకూ హోండా సిటీ సెడాన్ కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతుంది. అయితే, ఇందులో డీజిల్ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. కానీ, ఇది జరగడానికి కనీసం మరో సంవత్సరం సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే భారత మార్కెట్ కోసం అభివృద్ధి చేసిన డీజిల్ ఇంజన్‌ను హోండా ఇటీవలే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications









