సిటీ డీజిల్ ఈ ఏడాదిలో రాదట, సివిక్ డీజిల్ మాత్రం ఖాయం
ఎందుకంటే.. ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న 82వ అంతర్జాతీయ జెనీవా మోటార్ షోలో హోండా తమ సరికొత్త 1.6 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఈ ఇంజన్‌ను తొలిసారిగా హోండా సివిక్‌లో ఉపయోగిస్తామని, ఇది ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. 'ఎర్త్ డ్రీమ్స్ టెక్నాలజీ' బ్యానర్‌తో హోండా విడుదల చేయనున్న డీజిల్ ఇంజన్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించి తయారు చేసింది.
డీజిల్ ఇంజన్‌ల వల్ల పర్యావరణానికి కలిగే హానిని దృష్టిలో ఉంచుకొని హోండా ఈ ఇంజన్‌లను అభివృద్ధి చేయటం జరిగింది. ఈ ఇంజన్ ప్రతి కిలోమీటరుకు కేవలం 92 గ్రాముల కర్భన వ్యర్థాలను (సిఓ2) విడుదల చేస్తుంది. ఎర్త్ డ్రీమ్ టెక్నాలజీతో మరో మూడేళ్లలో ఇంజన్ ఎమిషన్‌ల విషయంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవాలని ఆశిస్తున్నామని కంపెనీ తెలిపింది.
కాగా.. హోండా ఆవిష్కరించిన 1596 సీసీ డీజిల్ ఇంజన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 118 బిహెచ్‌పిల శక్తిని, 2,000 ఆర్‌పిఎమ్ వద్ద 30.55 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. భవిష్యత్తులో బ్రయో, సిటీ, సిఆర్-వి మోడళ్లలో కూడా హోండా డీజిల్ వేరియంట్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఏదేమైనప్పటికీ, ఈ ఏడాది డీజిల్ సిటీని చూడాలనకున్న వారి కల మాత్రం కలగానే మిగిలిపోనుంది.


Click it and Unblock the Notifications









