డీజిల్ ఇంజన్ ప్లాంట్‌ను వాయిదా వేసిన హ్యుందాయ్
దేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్రన వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, భారత్‌లో డీజిల్ ఇంజన్ ప్లాంటు ఏర్పాటు అంశాన్ని మరోసారి వాయిదా వేసింది. గతంలో చెన్నైకు సమీపంలో ఓ డీజిల్ ఇంజన్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి యోచిస్తున్నామని ఈ కొరియన్ కంపెనీ ప్రకటించింది. అయితే, ప్రస్తుతం నత్తడకన సాగుతున్న కార్ల అమ్మకాలను చూసి హ్యుందాయ్ తమ డీజిల్ ఇంజన్ ప్లాంటు ఏర్పాటును వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, డీజిల్ కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఇండియాలో మరిన్ని డీజిల్ కార్లను ఉత్పత్తి చేసేందుకు అనుకూలంగా, ఇక్కడే ఓ డీజిల్ ఇంజన్ ప్లాంటును ఏర్పాటు చేయాలని హ్యుందాయ్ భావించింది. ఈ ప్లాంటు ఏర్పాటుకు గానూ రూ.400 కోట్ల పెట్టుబడులను సైతం వెచ్చిస్తామని గతంలో కంపెనీ పేర్కొనడం జరిగింది.
అయితే, భారత్‌లో ఇంధన ధరలపై ఓ స్పష్టమైన విధానం లేని కారణంగా, ప్రస్తుతానికి డీజిల్ ఇంజన్ ప్లాంటు ఏర్పాటు విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బో షిన్ సెయో తెలిపారు. ప్రస్తుతం హ్యుంద్యాయ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఐ20, వెర్నా వంటి కార్లలో ఉపయోగించే డీజిల్ ఇంజన్లను కొరియా నుంచి దిగుమతి చేసుకుంటోంది.
భారత్‌లో హ్యుందాయ్ డీజిల్ ఇంజన్ ప్లాంటును ఏర్పాటు చేయనుందన్న వార్తలు వెలువడగానే, కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కారు హ్యుందాయ్ ఐ10లో డీజిల్ వెర్షన్ అందుబాటులోకి రావచ్చనే పుకార్లు అప్పట్లో బాగానే షికార్లు చేశాయి. కాగా.. తాజా పరిస్థితులను గమనిస్తే, హ్యుందాయ్ ఐ10 డీజిల్ కల కలగానే మిగిలిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం భారతీయ కొనుగోలుదారులు అధిక మైలేజీనిచ్చే చిన్న కార్లను కొనడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో హ్యుందాయ్ ఐ10లో డీజిల్ ఆప్షన్ లభించినట్లయితే, అది సూపర్ హిట్ కావటం ఖాయం. హ్యుందాయ్ ఐ10 డీజిల్ ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఇంజన్లను దిగుమతి చేసుకొని ఇండియాలో ఐ10ను ఉత్పత్తి చేయాలంటే, ఉత్పాదక వ్యయం పెరిగి, ఫలితంగా కారు ధర కూడా పెరిగే అవకాశం ఉన్నందను ప్రస్తుతానికి డీజిల్ ఐ10ను హ్యుందాయ్ ఇక్కడి మార్కెట్లో అందించడం లేదు.


Click it and Unblock the Notifications









