మానేసర్ అల్లర్లు: మారుతి సుజుకి భవిష్యత్తు ఏంటి..?
దేశపు అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా అవతరించిన మారుతి సుజుకి ఇండియా భవిష్యత్తు మరింత అంధకారంలోకి వెళ్లనుందా..? అవుననే అంటున్నాయి మానేసర్ ప్లాంటులో తాజాగా నెలకొన్న పరిణామాలు. మానేసర్ ప్లాంటులో అనుసరిస్తున్న కఠినమైన హెచ్ఆర్ విధానాలతో విసుగు చెందిన కార్మికులు, టార్గెట్ చేసి మరీ కంపెనీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)ను హత్య చేయడంతో ప్రస్తుతం ప్లాంట్ లాకౌట్‌ను ప్రకటించడం జరిగింది.
ఇప్పటి వరకూ మానేసర్ ప్లాంటులో కార్మికులు పలుసార్లు సమ్మె నిర్వహించినప్పటికీ, ఇంతటి హింస ఏనాడు చోటు చేసుకోలేదు. ఈ ప్లాంటులో కొత్త యూనియన్ ఏర్పాటు విషయంలో కంపెనీ యాజమాన్యమ చూపిన వైఖరి, కార్మికుల జీతభత్యాల విషయంలో వ్యవహరించిన తీరు పట్ల అసంతృప్తి చెందిన కార్మికులు ఒక్కసారిగా విరుచుకుపడి కంపెనీ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించారు.
క్షణికావేశంలో కార్మికులు తీసుకున్న నిర్ణయం ఇటు కంపెనీ తీరని నష్టాన్ని మిగల్చడమే కాకుండా, అటు తమ జీవధారాన్ని కూడా దెబ్బతీసినట్లయింది. ప్రస్తుతం ఈ ప్లాంటు చుట్టూ పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఉన్నారు. ఇప్పటికే ఉత్పత్తి అయి, డిశ్పాచ్‌కు సిద్ధంగా ఉన్న వాహనాలను అత్యంత భద్రత నడుమ కంపెనీ డీలర్లకు తరలిస్తోంది. అయితే, గతకొద్ది రోజుల నుంచి ఈ ప్లాంటులో ఉత్పత్తి పూర్తిస్థాయిలో నిలిచిపోయింది.
ఈ తాజా సంఘటన పట్ల మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్.సి. భార్గవ విస్మయం వ్యక్తం చేశారు. తమ సొంత కార్మికులు ఇలా హింసాకాండకు పాల్పడతారని తానెన్నడూ ఊహించలేదని, వేగంగా కార్లను తయారు చేసి లాభపడాలన్న తొందర తమకు లేదని, స్నేహితులు, సహోద్యోగుల భద్రతే తమకు ప్రధానమని ఆయన అన్నారు. తాజా పరిస్థితులపై మరింత స్పష్టత కోసం కార్మికులతో చర్చలు జరపనున్నామని, మనేసర్‌లోని వర్కర్స్ యూనియన్‌లతో నెలవారీ సమావేశాలు నిర్వహిస్తామని అయన అన్నారు.
గడచిన సంవత్సరంలో మానేసర్ ప్లాంటులో జరిగిన నిరవధిక సమ్మె కారణంగా కంపెనీ భారీగా నష్టపోయి, మార్కెట్ విలువను కూడా కోల్పోయింది. మరికొంత కాలం మారుతి సుజుకి పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే, భారత ఆటోమొబైల్ మార్కెట్లో పెరుగుతున్న పోటీ, అధికమవుతున్న కార్ కంపెనీల దెబ్బకు మారుతి సుజుకి తన నాయకత్వపు స్థానాన్ని కోల్పోక తప్పదు.
మారుతి సుజుకి మానేసర్ వదలి వెళ్లిపోతుందా..?
మానేసర్ కార్మిక సమస్యతో కంపెనీ ఈ ప్రాంతాన్ని వదలి వేరే ప్రాంతానికి వెళ్లనుందా అని కంపెనీ చైర్మన్ ఆర్.సి భార్గవను ప్రశ్నించగా, అటువంటిదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. హర్యానాలో పారిశ్రామికీకరణ మారుతి సుజుకి ప్లాంట్‌తోనే ఊపందుకుందని ఆయన గుర్తు చేశారు.
మానేసర్ అల్లర్ల ప్రభావం గుర్‌గావ్ ప్లాంట్‌పై పడిందా..?
మానేసర్ ప్లాంట్‌లో నెలకొన్ని అనిశ్చితి సమీపంలో ఉన్న గుర్‌గావ్ ప్లాంట్‌పై పడలేదు. ఈ ప్లాంట్‌లో యధావిధిగా ఉత్పత్తి కొనసాగుతున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఈసారి మరింత జాగ్రత్తగా నియామకం.
మానేసర్ ప్లాంటులో పరిస్థితి సద్దుమణిగిన తర్వాత, ప్లాంటును తిరిగి తెరిచేటప్పుడు ఏ విధమైన రిస్క్ ఉండదని భావించిన ఉద్యోగులను మాత్రమే విధుల్లోకి తీసుకుంటామని, సమస్యలను సృష్టిస్తున్నారని అనుమానించిన వారికి స్థానం ఇవ్వబోమని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications









