జోరుగా సాగుతున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు
ఆటో దిగ్గజం టాటా మోటార్స్ దేశీయ అమ్మకాలు గడచిన జూన్ నెలలో స్వల్పంగా తగ్గుముఖం పట్టినప్పటికీ, అంతర్జాతీయ అమ్మకాలు మాత్రం జోరుగానే సాగాయి. టాటా మోటార్స్ తన గ్లోబల్ మార్కెట్ పరిమాణాన్ని పెంచుకోవడంతో పాటుగా, కంపెనీ లగ్జరీ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు కూడా జోరుగా సాగుతుండటంతో కంపెనీ విక్రయాలు ఊపందుకున్నాయి.
గడచిన నెలలో టాటా మోటార్స్ అంతర్జాతీయంగా 94,055 వాహనాలను విక్రయించి గతేడాది జూన్ నెలతో పోల్చుకుంటే ఇది 6 శాతం వృద్ధిని సాధించింది. ఇందులో జాగ్వార్ బ్రాండ్ అమ్మకాలు 5 శాతం తగ్గుముఖం పట్టగా, ల్యాండ్ రోవర్ అమ్మకాలు మాత్రం 49 శాతం వృద్ది చెందాయని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
మొత్తమ్మీద జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు 39 శాతం వృద్ధి చెంది 28,215 యూనిట్లుగా నమోదయ్యాయి. గత నెలలో మొత్తం ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 7 శాతం పెరిగి 46,159 యూనిట్లుగా నమోదు కాగా, వాణిజ్య వాహనాల అమ్మకాలు 6 శాతం పెరిగి 47,896 యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications









