ఆటో ఎల్‌పిజి ధర పెంపుతో పెరగనున్న ఆటో ఛార్జీలు

ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఎక్కువగా ఎల్‌పిజితో నడిచే ఆటోలు ఉన్నాయి. తాజా పెంపుతో ఆటో ఎల్‌పిజి ధర లీటరుకు రూ.43.65 నుండి రూ.49.72 పెరిగింది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లు కూడా ఆటో ఛార్జీలను పెంచే ఆస్కారం ఉంది. ఈ ఏడాదిలో ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు ఇలా ఆటో ఎల్‌పిజి ధరలు పెంచటం ఇది మూడవసారి. గడచిన మార్చి 1 వ తేదీన కూడా ఆటో ఎల్‌పిజి ధరను ప్రతి లీటరుపై రూ.3 మేర పెంచారు.
అంతేకాకుండా, కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే లభ్యమవుతున్న సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) ధరను కూడా ప్రతి కిలోపై రూ.4.70 మేర పెంచటం జరిగింది. దీంతో ప్రస్తుతం కేజి (కిలో గ్రాము) సిఎన్‌జి ధర రూ.45.50 నుండి రూ.50.20 లకు పెరిగింది. మరోవైపు గత కొద్ది రోజులుగా పెట్రోల్ ధరలను పెంచకపోవడంతో చమురు కంపెనీలు రోజుకు రూ.48 కోట్ల నష్టపోతున్నాయి.
దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాలను భర్తీ చేయటమో లేదా ధరలను పెంచేందుకు అనుమతివ్వటమో చేయాలని లేకపోయినట్లయితే పెట్రోల్ సరఫరాను నిలిపి వేస్తామని ప్రభుత్వరంగ చమురు సంస్థలు కేంద్రాన్ని హెచ్చరించాయి. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే, త్వరలోనే వినియోగదారులపై కూడా పెట్రో భారం పడటం ఖాయం.


Click it and Unblock the Notifications








