మొన్న చైనా బొమ్మలు, నిన్న చైనా ఫోన్లు, నేడు చైనా ఆటోలు

రూ.30,000 ఖరీదైన ఒరిజినల్ ఐఫోన్‌కు కేవలం రూ.3,000 ఖర్చుతో డూప్లికేట్ వెర్షన్‌ను తయారు చేయగల చైనా కంపెనీలు లక్ష రూపాయాల ఖరీదైన ఆటోమొబైల్‌ను కేవలం సగం ధరకే అంటే రూ.50,000 లకే అందించినా ఆశ్చర్యం లేదు. త్వరలోనే ఇది నిజం కానుంది. చైనాలోని షాంగైకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ 'రోమై ఎలక్ట్రిక్ వెహికల్' ఇండియాలో ఆటోరిక్షాలకు ప్రత్యామ్నాయంగా బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
రూ.40,000 నుండి రూ.50,000 మధ్యలో త్రిచక్ర వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని కంపెనీ అధికారి ఒకరు వెళ్లడించారు. ఇవి ఆర్థికంగా పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల కన్నా ఎంతో మెరుగ్గా ఉంటాయని ఆయన అన్నారు. ఈ ఉత్పత్తి కేరళ రోడ్లపై పరీక్షించేందుకు గానూ రోమై ఎలక్ట్రిక్ వెహికల్ ఇంటర్నేషల్ ట్రేడ్ డిపార్ట్‌మెంట్ అధికారి మేరీ కొచ్చిన్‌కు విచ్చేశారు.
ప్రయాణికులను తరలించేందుకు కంపెనీ వద్ద 60 వోల్టుల నుండి 1000 వాట్‌ల వరకూ సామర్థ్యం కలిగిన త్రిచక్ర వాహనాలున్నాయని, 200 వాట్‌లు అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన వాహనాలను రాష్ట్రంలో విడుదల చేసేందుకు ప్రవేశిస్తున్నామని మరొక అధికారి అన్నారు. ఈ వాహనాలు విడుదల చేయడానికి ముందుగా మూడు కంటైనర్లలో వాహనాలు, విడిభాగాలను తరలిస్తామని ఆయన అన్నారు. మరి చైనా బ్రాండ్ అంటే ఆషామాషీ అనుకున్నారా..!!


Click it and Unblock the Notifications








