ఎక్స్‌యూవీ500 ఉత్పత్తిని పెంచనున్న మహీంద్రా

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ పూణేలోని ఛాక్కన్ ప్లాంటులో ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం ఈ ప్లాంటులో రోజుకు 110 ఎక్స్‌యూవీ500 యూనిట్లు ఉత్పత్తి అవుతుండగా, వచ్చే ఏప్రిల్ నాటికి ఈ సంఖ్యను 160 యూనిట్లకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ500కు దేశీయ మార్కెట్ నుండే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్ల నుండి మంచి స్పందన వస్తుండటంతో, సదరు డిమాండ్‌ను అందుకునేందుకు గానూ ఈ మోడల్ ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీ కసరత్తులు చేస్తోంది. 2013 నాటికి ఆస్ట్రేలియన్, యూరోపియన్ మార్కెట్లలో ఈ మోడల్‌ను విక్రయించాలని మహీంద్రా సన్నాహాలు చేస్తుంది.
వరల్డ్ క్లాస్ ఫీచర్లతో రూపొందించిన మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ డబ్ల్యూ6, డబ్ల్యూ8 (టూ-వీల్ డ్రైవ్), డబ్ల్యూ8 (ఫోర్-వీల్ డ్రైవ్) అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. కాగా.. ఈ నెల 1వ తేదీ నుండి మహీంద్రా ఎక్స్‌యూవీ500 ధరలను కంపెనీ పెంచిన విషయం తెలిసిందే. ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ500 విషయానికి వస్తే.. ఇందులో 2.2 లీటర్ కామన్-రైల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు.
ఇది 140 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 33 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో ఎల్‌ఈడి లైట్లు, టచ్-ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్, ఈఎస్‌పి మరియు బ్లోవర్ కంట్రోల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక, భద్రతా ఫీచర్లు ఉన్నాయి. రెండు వెర్షన్లలో (టూ-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్) లభించే మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








