మహీంద్రా జిఏ 10 విమానం సక్సెస్, త్వరలోనే భారత మార్కెట్లో విడుదల
ఎస్‌యూవీల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను సంపాదించుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పుడు విమానయానంలో ఓ ప్రత్యేక స్థానం కోసం సన్నాహాలు చేస్తుంది. మహీంద్రా గ్రూపుకు చెందిన విమానయాన విభాగం మహీంద్రా ఏరోస్పేస్ ఇటీవల అభివృద్ధి చేసిన 'జిఏ 10' అనే తేలికపాటి విమానాన్ని వియవంతంగా పరీక్షించినట్లు కంపెనీ పేర్కొంది.
మహీంద్రాకు చెంది ఆస్ట్రేలియన్ అనుబంధ కంపెనీ మహీంద్రా గిప్స్‌ఏరో ఈ సింగిల్ టర్బో-ప్రోప్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేసింది. 'జిఏ 8' అనే విజయవంతమైన ఎనిమిది సీట్లు కలిగిన యుటిలిటీ ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లాట్‍ఫామ్ ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ విమానాన్ని రూపొందించింది. జిఏ 10లో పది సీట్లు ఉంటాయి. జిఏ 10 ఎయిర్‌క్రాఫ్ట్‌లో రోల్స్ రాయిస్ 250 టర్బో ప్రోప్ ఇంజన్‌ను ఉపయోగించారు.

నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ మరియు మహీంద్రా సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'ఎన్ఎమ్5' అనే ఫైవ్-సీట్ పిస్టన్-ఇంజన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మహీంద్రా గడచిన సెప్టెంబర్ నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. జిఏ 10 ఎయిర్‌క్రాఫ్ట్‌ను త్వరలోనే ఇండియాలోనూ పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా (సిస్‌టెక్ సెక్టార్) అధ్యక్షుడు హేమంత్ లౌత్రా తెలిపారు.
ఈ ఏయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ కోసం మరిన్ని సౌకర్యాలను అమర్చుకునేందుకు కోసం వచ్చే మూడేళ్లలో రూ.450 కోట్లకుపైగా పెట్టుబడులను కంపెనీ వెచ్చించనుంది. బెంగుళూరుకు 40 కి.మీ. దూరంలో ఉన్న నర్సాపురాలో ఎయిర్‌క్రాఫ్ట్ పరికరాల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నామని మహీంద్రా ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరవింద్ మెహ్రా గతంలో వెల్లడించారు.


Click it and Unblock the Notifications








