అప్‌గ్రేడెడ్ థార్ ఎస్‌యూవీని విడుదల చేసిన మహీంద్రా
ఎండల్లో మండిపోతున్న వారికి ఓ చల్లటి వార్త..! ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ "థార్"లో ఎయిర్ కండిషన్‌తో కూడిన ఓ కొత్త వేరియంట్‌ను కంపెనీ నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. 'న్యూ కూల్ థార్' అని మహీంద్రా పిలిచే ఈ ఎస్‌యూవీలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఎయిర్ కండిషనింగ్ (ఏసి) లభిస్తుంది.
కొత్త థార్ బిఎస్-4, 2.5 లీటర్, 105 బిహెచ్‌పి సిఆర్‌డిఈ ఇంజన్ మరియు బిఎస్-3 డిఐ ఇంజన్ వేరియంట్లలో లభ్యం కానుంది. బొలెరో, స్కార్పియోల కలయికతో కూడిన షాషీ (ఛాస్సిస్) ఆధారంగా ఈ కొత్త థార్‌ను రూపొందించారు. అంతేకాకుండా "థార్ ఎక్స్‌పెడిషన్" అనే కస్టమైజ్డ్ వెర్షన్ థార్‌ను కూడా మహీంద్రా ప్రదర్శనకు ఉంచింది. ఇందులో ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్రంట్ బుల్‌బార్ (ఎలక్ట్రిక్ వించ్‌తో కూడినది), రాక్ స్లైడర్స్, ఎక్స్‌పెడిషన్ కారియర్, రోల్ కేజ్ వంటి ఆఫ్-రోడ్ ఫీచర్లను గమనించవచ్చు.
మహీంద్రా థార్ ఎస్‌యూవీని ఆఫ్-రోడ్ అడ్వెంచర్ రైడ్‌లంటే ఇష్టపడేవారు, యువకులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అలాగే, తమ రోజూవారీ కార్యకలాపాల కోసం కూడా కొందరు ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేస్తారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని, ప్రస్తుతం వేసవి సీజన్ కూడా కావడంతో ఎయిర్ కండిషనింగ్‌తో కూడుకున్న ఈ సరికొత్త వేరియంట్‌ను మహీంద్రా అండ్ మార్కెట్లోకి తీసుకు వచ్చింది. మహీంద్రా థార్ ఏసి ధర రూ.6.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది.


Click it and Unblock the Notifications









