దీపావళి కానుకగా వస్తున్న మహీంద్రా రేవా ఎన్ఎక్స్ఆర్
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) కొనుగోలు చేసిన బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ 'రేవా' మరియు ఎమ్ అండ్ ఎమ్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఫోర్ సీటర్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు "రేవా ఎన్ఎక్స్ఆర్" విడుదలకు ముహుర్తం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఒక్క ఇండియన్ మార్కెట్లోనే కాకుండా, ఎలక్ట్రిక్ కార్లకు అనువుగా ఉండే ప్రపంచ మార్కెట్లను సైతం దృష్టిలో ఉంచుకొని మహీంద్రా రేవా ఈ నెక్స్ట్-జెన్ రేవా ఎన్ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేసింది.
రేవా ఎన్ఎక్స్ఆర్ కాన్సెప్ట్‌ను మహీంద్రా రేవా తొలిసారిగా గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రజలకు పరిచయం చేసింది. కాగా.. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ కారును అన్ని మార్కెట్ పరిస్థితులకు అనువుగా ఉంటుందో లేదోనని కంపెనీ టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే బెంగుళూరులో ఓ టెస్ట్ రేవా ఎన్ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ కారు దర్శనమిచ్చింది. మాకు అందిన సమాచారం ప్రకారం, రేవా ఎన్ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ కారు టెస్టింగ్ దశను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.
ఇక ఇది వాణిజ్య పరంగా మార్కెట్లోకి రావటమే తరువాయి. రేవా కంపెనీ కేవలం ఒకే ఒక్క మోడల్‌ను మార్కెట్లో అందిస్తుంది. 2001లో విడుదలైన రేవా ఎలక్ట్రిక్ కారు "రేవా ఐ" తర్వాత వచ్చిన తొలి అప్‌గ్రేడెడ్ మోడలే రేవా ఎన్ఎక్స్ఆర్. రేవా ఐ కారులో కేవలం ఇద్దరికి మాత్రమే చోటుంటే, రేవా ఎన్ఎక్స్ఆర్ కారులో నలుగురు ప్రయాణికులకు చోటుంటుంది. బ్యాటరీ మెయింటినెన్స్, మోటార్ పవర్‌లో రేవా ఐ కన్నా మరింత మెరుగ్గా ఉండేలా రేవా ఎన్ఎక్స్ఆర్ మహీంద్రా రేవా తీర్చిదిద్దింది.
రేవా ఎన్ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ కారులో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 17.5 బిహెచ్‌పిల శక్తిని, 55 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించేందుకు వీలుగా ఇందులో అధిక మన్నిక గల బ్యాటరీని ఉపయోగించారు. అంతేకాకుండా బ్యాటరీ పవర్ వృధాగా ఖర్చు కాకుండా ఉండేందుకు దీని గరిష్ట వేగాన్ని నియంత్రించారు. రేవా ఎన్ఎక్స్ఆర్ కారును పూర్తిగా ఛార్జ్ చేస్తే 160 కి.మీ. దూరం వరకూ ప్రయాణిస్తుంది. రేవా ఎన్ఎక్స్ఆర్ రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల ధరతో వచ్చే నవంబర్ నాటికి మార్కెట్లోకి రావచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








