మహీంద్రా రేవాకు ఐజిబిసి ప్లాటినం రేటింగ్ అవార్డ్
మహీంద్రా గ్రూపుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ 'మహీంద్రా రేవా'కు అరుదైన సత్కారం లభించింది. మహీంద్రా రేవాకు ప్రతిష్టాత్యక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి) ప్లాటినం రేటింగ్ లభించింది. దీంతో ఈ సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి భారత ఆటోమొబైల్ తయారీ ప్లాంట్‌గా మహీంద్రా రేవా నిలిచింది.
బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ రేవాను మహీంద్రా అండ్ మహీంద్రా రేండేళ్ల క్రితం స్వాధీనం చేసుకుంది. యూరోపియన్ మార్కెట్లలో మహీంద్రా రేవా కార్లకు మంచి డిమాండ్ కూడా ఉంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఇందులో ఫోర్-సీటర్ ఎలక్ట్రిక్ కారును (మహీంద్రా రేవా ఎన్ఎక్స్ఆర్)ను కంపెనీ అభివృద్ధి చేసింది.
పర్యావరణ పరిరక్షణలో అత్యున్నతస్థాయి ప్రమాణాలు పాటించే సంస్థగా తమకు ఈ రేటింగ్ లభించడం గర్వకారణమని మహీంద్రా రేవా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. తమ భవిష్యత్ ప్రాజెక్టులను సైతం పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో తాజా రేటింగ్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ అండ్ ఫామ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్స్) పవన్ గోయంకా తెలిపారు.
ప్రస్తుతం మహీంద్రా భారత మార్కెట్లో కేవలం టూ-సీటర్ ఎలక్ట్రిక్ కారు 'రేవా ఐ'ను మాత్రమే అందిస్తోంది. దేశీయ విపణిలో వీటి ధరలు రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. కంపెనీ తాజాగా అభివృద్ధి చేసిన ఫోర్ సీటర్ ఎలక్ట్రిక్ కారు రేవా ఎన్ఎక్స్ఆర్ ఈ ఏడాది దీపావళి నాటికి మార్కెట్లో వాణిజ్యం పరంగా లభించవచ్చని తెలుస్తోంది. ఈ కారును తొలిసారిగా గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ప్రదర్శించింది.


Click it and Unblock the Notifications









